Bhumi Pednekar: అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో..
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:14 AM
నేను నా కెరీర్ బిగినింగ్ నుంచే సమాజంపై ప్రభావం చూపించే, ప్రేక్షకుల ఆలోచనాలు మార్చే కథల గురించి పరిశోధిస్తుంటాను. తెరపైనే కాదు.. ఆఫ్- స్క్రీన్ లోనూ వాతావరణంలో మార్పులు తీసుకురావడంలో కృషి చేయడమనేది నా జీవితంలో ఒక ప్రత్యేక భాగం
అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందుకుని మన దేశ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెబుతున్నారు బాలీవుడ్ నటి భూమి (Bollywood Actress) పెడ్నేకర్(Bhumi Pednekar). ఆమె కథల ఎంపిక విలక్షణంగా ఉంటుంది. చక్కని సందేశాలిచ్చే బలమైన పాత్రలను, కథలను ఎంచుకుంటారీమె. గతేడాది ‘భక్షక్’తో విజయం అందుకోవడంతోపాటు నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో నిజాల్ని బయటపెట్టే జర్నలిస్ట్‌గా వైశాలీ సింగ్ పాత్రలో ఒదిగిపోయి నటించింది. సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు గ్లోబల్ లీడర్‌గా (Global Leader) సామాజిక సమస్యలపై గళం విప్పుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో వాతావరణ మార్పులపై సినిమాలు, తన రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
‘‘నేను నా కెరీర్ బిగినింగ్ నుంచే సమాజంపై ప్రభావం చూపించే, ప్రేక్షకుల ఆలోచనాలు మార్చే కథల గురించి పరిశోధిస్తుంటాను. తెరపైనే కాదు.. ఆఫ్- స్క్రీన్ లోనూ వాతావరణంలో మార్పులు తీసుకురావడంలో కృషి చేయడమనేది నా జీవితంలో ఒక ప్రత్యేక భాగం. భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని, కలుషితం లేని వాతావరణాన్ని అందించాలనేది నా కోరిక. ఈ బాటలోనే ఇప్పుడు నేను వాతావరణ సమస్యలు, మార్పులపై సినిమాల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నా. ప్రస్తుతం వాతావరణ సమస్యలపై మనకు సినిమాలు అవసరం’’.
‘‘నేను ఎంచుకునే కథలు, పాత్రల దృష్ట్యా నాకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా ఎప్పుడూ భారతీయ చిత్రపరిశ్రమను వదిలిపెట్టను. కానీ నేను మన దేశ సంస్కృతిని అంతర్జాతీయ స్థ్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నా. అందుకే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని బలంగా కోరుకుంటున్నా. కళకు, భాషకు సరిహద్దులు అనేవి ఉండవు. ప్రతీ నటి భాషతో సంబంధం లేకుండా తనని తాను నిరూపించుకోవాలని కోరుకుంటుంది. నేనూ అంతే. ప్రస్తుతం ఎఐ టెక్నాలజీ హవా నడుస్తోంది. భవిష్యత్తు సినిమాల్లో దీన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తారు. ఈ ఏఐ వల్ల సినిమాల్లో కొత్త ప్రపంచాల్ని సృష్టించబోతున్నారు. కానీ దీన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మనమే. ఈ సాంకేతికత వల్ల చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతారా? అంటే అవుననే అంటాను. కానీ అంతకంటే ఎక్కువ ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తుంది’’ అని అన్నారు.