Ayesha Takia: సూపర్ హీరోయిన్ ఆవేదన

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:34 PM

ప్రముఖ బాలీవుడ్ నటి ఆయేషా టకియా తెలుగు వారికీ సుపరిచితమే. ఆమె భర్త ఇటీవల గోవాలో ఓ కారు యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకున్నాడు. అయితే అందులో తన భర్త తప్పులేదంటోంది ఆయేషా టకియా.

'సూపర్' చిత్రంతో తెలుగువారికి చేరువైన అందాల భామ ఆయేషా అకియా ఇప్పుడో సమస్యలో చిక్కుకుంది. గోవాలో అయేషా టకియా (Ayesha Takia) భర్త ఫర్హాన్ అజ్మీ కారు డ్రైవింగ్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తన భర్తను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆమె ఆరోపిస్తోంది. గొడవ సంబంధించిన సాక్ష్యాలు త‌న ద‌గ్గర ఉన్నాయ‌ని, వాటిని వీడియోల‌తో స‌హా బ‌య‌ట‌పెడ్తానని అంటోంది. త‌మ‌కు న్యాయం కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయేషా వరుస పోస్టులు పెడుతోంది. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారిపోయింది.

గోవాలో అయేషా భ‌ర్త ఫ‌ర్హాన్.. ఓ సూప‌ర్ మార్కెట్ మ‌లుపు దగ్గర సిగ్నల్ ఇవ్వకుండానే కారును న‌డ‌ప‌డం ఈ వివాదానికి కార‌ణ‌మైంది. నిర్లక్ష్యంగా కారును న‌డిపారంటూ ఇద్దరు స్థానికులు ఆయ‌న‌తో వాగ్వాదానికి దిగారు. గొడ‌వ పెద్దది కావ‌డంతో జ‌నం గుమిగూడారు. ఈ క్రమంలో అయేషా భర్త ఫర్హాన్ అజ్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికులతో జరిగిన గొడవలో ఫర్హాన్ తుపాకీ తీశాడన్నది ఆయ‌న‌పై ఆరోప‌ణ‌. దీనిపై అయేషా తీవ్రంగా స్పందిస్తోంది.


మహారాష్ట్ర నుండి వచ్చినందుకు అక్కడి వారు త‌మ‌ను టార్గెట్ చేశారని ఆయేషా ఆరోపించింది. పోలీసులు కూడా తమకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెలిపింది. తమ కుటుంబానికి ఎదురైన ఆ భయానక రాత్రి గురించి వ‌రుస పోస్టుల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. స్థానికులు తన భర్త, కొడుకుపై దాడి చేసి బెదిరించారని ఆమె ఆరోపించింది. గంటల తరబడి తన భర్త, కొడుకును హింసించారని‌, ప్రాణాలు తీసేందుకు కూడా తెగబడ్డారని ఆవేద‌న వ్యక్తం చేసింది. పోలీసు సహాయం కోసం 100కు డయల్ చేసిన తన భర్త పైనే తప్పుగా కేసు నమోదు చేశారని కూడా అయేషా ఆరోపించింది. త‌మ వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను న్యాయ‌స్థానానికి అంద‌జేస్తామ‌ని, త‌మ‌కు న్యాయం ద‌క్కుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఆయేషా టకియా ఆవేదనను ప్రభుత్వం, అధికారులు ఏమేరకు పట్టించుకుంటారో చూడాలి.

Also Read: SYG:1000 మంది డాన్సర్లతో మెగా సుప్రీం హీరో రచ్చ

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 06:34 PM