Anurag Kashyap: రాజమౌళిని కాపీ కొట్టాలనుకుంటున్నారు..

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:43 PM

సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతారు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌. ఇటీవల ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను బాలీవుడ్‌ సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు.

సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతారు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap). ఇటీవల ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను బాలీవుడ్‌ (bollywood) సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు సినిమాలను ఉద్దేశించి మాట్లాడారు. పాన్‌ ఇండియా అనేది కొత్త విషయం కాదు. ఎంతోకాలంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఇలాంటి చిత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘విద్యార్థులకు అవకాశాలు కల్పించండి. వాళ్లని సినిమాలు చూడనివ్వండి?. పుస్తకాలు చదవనివ్వండి.  ఆ విధంగా తమని తాము మలుచుకోనివ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. మనకు ఒక రాజమౌళి (Rajamouli) ఉన్నారు. ఆయన్ని చూసి సుమారు 10 మంది డూప్లికేట్‌ రాజమౌళిలు పుట్టుకొచ్చారు. ఆయన్ని కాపీ కొట్టాలనే వీరంతా ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆయన ఐడియాలు మాత్రమే ఒరిజినల్‌.

అదే విధంగా ‘కేజీయఫ్‌’ (KGF)వచ్చింది. సక్సెస్‌ అయింది. దానినే ఒక ట్రెండ్‌గా తీసుకొని అందరూ అలాంటి సినిమాలే చేస్తున్నారు. మనం పాన్‌ ఇండియా సినిమాలు ఎప్పుడు చేయలేదు చెప్పండి? ‘ప్రతిబంధ్‌’, ‘శివ’.. ఇలా ఎన్నోఏళ్ల నుంచి పాన్‌ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి అదేం కొత్త కాదు. నా చిన్నతనంలోనే నేను పాన్‌ ఇండియా సినిమాలు చూశా. ఇప్పుడున్న రోజుల్లో పాన్‌ ఇండియా పేరు చెప్పి కొంతమంది సరైన చిత్రాలు తెరకెక్కించడం లేదు. ఒకేతరహా కథలను తెరపై చూపిస్తున్నారు’ అని కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌లో దర్శకుడిగా పేరుపొందిన అనురాగ్‌.. ప్రస్తుతం దక్షిణాదిలో నటుడిగా రాణిస్తున్నారు. గతేడాది విడుదలైన ‘మహారాజ’లో ఆయన పాత్ర ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘డకాయిట్‌’ సినిమా చేస్తున్నారు.  

Updated Date - Mar 27 , 2025 | 05:48 PM