Anurag kashyap: హిందీ సినిమాలపై అనురాగ్‌ కశ్యప్‌ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:57 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో (bollywood) నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag kashyap) కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్‌ ఆడియన్స్‌ను పట్టించుకోవడం బాలీవుడ్‌ ఎప్పుడో మానేసిందని కామెంట్‌ చేశారు


ప్రస్తుతం బాలీవుడ్‌లో (bollywood) నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag kashyap) కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్‌ ఆడియన్స్‌ను పట్టించుకోవడం బాలీవుడ్‌ ఎప్పుడో మానేసిందని కామెంట్‌ చేశారు. ఆ కారణంగానే దక్షిణాది చిత్రాలు, ఫిల్మ్‌ మేకర్స్‌కు ఈ మార్కెట్‌లో ఆదరణ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని అనురాగ్‌ అన్నారు. ‘‘మన ప్రేక్షకులను మనమే విస్మరిస్తున్నారు. నేను రూపొందించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాస్సేపూర్‌’ (2012), ‘ముక్కబాజ్‌’ (2018) చిత్రాలకు ఇప్పుడు నార్త్‌ ఇండియాలో విశేష ఆదరణ ఉంది. కానీ ఆయా చిత్రాలను విడుదల చేసినప్పుడు.. సినిమాకు కీలకమైన మార్కెట్‌లో దానిని రిలీజ్‌ చేయలేదు. సినిమా విడుదల విషయంలో నిర్మాణసంస్థలు ఏ విధంగా ఆలోచిస్తుంటాయో ఆ చిత్రాల  డిస్ట్రిబ్యూషన్  మీటింగ్‌కు వెళ్లినప్పుడు తెలిసింది. ఆయా చిత్రాలకు కీలక ఆడియన్స్‌ ముంబయి, ఢిల్లీ, చండీగడ్‌, హైదరాబాద్‌లోనే ఉంటారని నిర్మాణ సంస్థ భావించింది. ఆవిధంగానే డబ్బింగ్‌ చేసి ఆయా ప్రాంతాల్లో సినిమాలను విడుదల చేసింది. (Anurag kashyap comments on bollywood)

ఈ విషయం తెలిసి బీహార్‌కు చెందిన ఒక థియేటర్‌ యజమాని తమ ప్రాంతంలో విడుదల చేయమని ఎంతో బతిమాలాడు. ఆ ప్రాంతానికి అనుగుణంగా డబ్బింగ్‌ చేసి విడుదల చేయడానికి డబ్బులు బాగా ఖర్చు అవుతాయని భావించి నిర్మాణ సంస్థ అతడి విన్నపాన్ని పట్టించుకోలేదు. అలా నా సినిమాలకు సంబంధించి కోర్‌ ఆడియన్స్‌ ఆదరణ అందుకోలేకపోయింది. కొవిడ్‌ సమయంలో ఆ రెండు చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. యూట్యూబ్‌ వల్లే అది సాధ్యమైంది’’ అని అనురాగ్‌ అన్నారు. దక్షిణాది చిత్రాలకు నార్త్‌లో ఆదరణ పెరగడానికి గల కారణాన్ని తెలియజేశారు అనురాగ్‌.

 ‘‘మనం హిందీ సినిమాలు చేస్తున్నాం. కానీ హిందీ ఆడియన్స్‌నే పట్టించుకోవడం మానేస్తున్నాం. దీనిని కొంతమంది అనువుగా చేసుకొని యూట్యూబ్‌ ఛానల్స్‌ ప్రారంభించారు. దక్షిణాదికి సంబంధించిన కొన్ని చిత్రాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసి అనువదించి తమ ఛానల్ ద్వారా హిందీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది.  దక్షిణాది చిత్రాలను వీక్షించడానికి నార్త్‌ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇటీవల ‘పుష్ప 2’ కార్యక్రమాన్ని పట్నాలో పెట్టారు’’ అని ఆయన వివరించారు.

Updated Date - Jan 02 , 2025 | 12:58 PM