Anupam Kher: నియమ నిబంధనలు తెలుసు.. అయినా ఎందుకిలా..

ABN , Publish Date - Feb 25 , 2025 | 11:06 AM

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఎక్స్‌ ఖాతా కొంత సమయం పాటు లాక్‌ అయింది. ఇలా జరగడానికి గల కారణం ఏమిటో తెలియజేయాలని ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించారాయన.


బాలీవుడ్‌ నటుడు (bollywood actor) అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) ఎక్స్‌ ఖాతా కొంత సమయం పాటు లాక్‌ అయింది. ఇలా జరగడానికి గల కారణం ఏమిటో తెలియజేయాలని ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించారాయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టును పంచుకున్నారు.  సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ్‌ ఎక్స్‌ (X locked) వేదికగా ఓ పోస్టు పెట్టారు. కొంత సమయం పాటు తన అకౌంట్‌ ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. లాగిన్‌ కావడానికి ప్రయత్నించగా..  ‘‘మీ అకౌంట్‌ లాక్‌ అయింది. ఈ  ప్లాట్‌ఫామ్‌ వేదికగా మీరు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ విషయమై డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం కింద ఎక్స్‌కు ఒక ఫిర్యాదు అందింది’’ అని అందులో పేర్కొన్నారు. తాజాగా అనుపమ్‌ ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ..

‘‘డియర్‌ ఎక్స్‌.. నా ఖాతాకు సంబంధించి  సేవలు పునఃప్రారంభమైనప్పటికీ నా అకౌంట్‌ ఎందుకు నిలిచిపోయిందో అర్థం కావడం లేదు. 2007 సెప్టెంబరు నుంచి నేను ఈ వేదికలో ఖాతా కలిగి ఉన్నాను. ఎక్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలపై నాకంటూ కొంత అవగాహన ఉంది. కాబట్టి ఈ విషయం నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది. మీ నిబంధనలకు విరుద్థంగా నేను చేసిన పోస్ట్‌ ఏమిటి? దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని నోట్‌లో పేర్కొన్నారు. తెలుగులో కార్తికేయ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం తెలుగులో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Feb 25 , 2025 | 12:06 PM