Old Love Birds: 18 యేళ్ళ తర్వాత...
ABN , Publish Date - Mar 10 , 2025 | 02:32 PM
పద్దెనిమిదేళ్ళ క్రితం చివరి సారిగా కలిసి నటించిన లవ్ బర్డ్స్ కరీనా, షాహిద్ కపూర్ ఇంతకాలానికి ఒకే వేదికపై కలిసి మెరిశారు. ముందు ముభావంగా ఉన్నా... ఆ తర్వాత మనసు విప్పి మాట్లాడుకున్నారు!
ఒకప్పుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor), కరీనా కపూర్ (Kareena Kapoor) అంటే బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉండేది. వారు కలిసి నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. ''చుప్ చుప్ కే, ఫిదా, 36 చైనా టౌన్'' చిత్రాలలో నటించిన వీరు చివరగా 'జబ్ వియ్ మెట్' (Jab We Met) లో జంట కట్టారు. ఆ సినిమా 2007లో జనం ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి చాలామంది త్వరలో షాహిద్, కరీనా పెళ్ళి చేసుకుంటారని భావించారు. వీళ్ళు కూడా కలిసి పలు కార్యక్రమాలకు హాజరు కావడం, సినిమా వేడుకల్లో పాల్గొనడం చేశారు. దాంతో వీరి మధ్య బలమైన ప్రేమ బంధం ఉందని, అది వివాహానికి ఖచ్చితంగా దారితీస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో... కరీనా కపూర్, షాహిద్ కపూర్ మధ్య దూరం పెరిగింది. 'జబ్ వియ్ మెట్' తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. కరీనా... అప్పటికే పెళ్ళై, విడాకులు తీసుకున్న సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ను 2012లో పెళ్ళి చేసుకుంది. షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ను పెళ్ళాడాడు. ఇక అప్పటి నుండి ఎవరికి కెరీర్ వారు కొనసాగిస్తున్నారు.
Also Read: Jagga Reddy: జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్...
లవ్ బ్రేకప్ జరిగిన తర్వాత ఇటు కరీనా కపూర్, అటు షాహిద్ కపూర్ ఇద్దరూ కలిసి ఏనాడు, ఏ వేదిక పంచుకోలేదు. కనీసం సినిమా రంగానికి చెందిన ఫంక్షన్స్ లోనూ కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదు. అలాంటి వీరిద్దరూ దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఐఫా వేడుకలో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి చేతుల మీదగా నిర్వాహకులకు కొన్ని అవార్డులను ఇవ్వడానికి స్టేజ్ పైకి పిలిచారు. ఆ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుండా, ఎడమొఖం పెదముఖంగా వ్యవహరించారు. చెరొక దిక్కు చూస్తుండిపోయారు. అస్సలు పరిచయమే లేని వ్యక్తుల్లా వ్యవహరించారు. చివరకు కరీనా కపూర్ చొరవ తీసుకుని, షాహిద్ భుజాన్ని తట్టి అతన్ని పలకరించింది. ఓ విషయమై ఆరా తీసింది. దాంతో షాహిద్ ముఖం వెయ్యి వాల్ట్స్ బల్బులా వెలిగిపోయింది. ఆమెకు నవ్వుతూ బదులిచ్చాడు. కరీనా కపూర్ కూడా తరచి తరచి అతన్ని ప్రశ్నలు వేసి జవాబును రాబట్టింది. ఈ వీడియోను చూసిన వారిద్దరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఇంతకాలానికి మళ్ళీ మాజీ ప్రేమికులు అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు చనువుగా మాట్లాడుకోవడం చూసి ఎంతో ఆనందపడ్డారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఇంతకాలానికి కలిసి, చక్కగా మాట్లాడుకున్న వీరిద్దరూ... మళ్ళీ కలిసి సినిమా ఏదైనా చేస్తారేమో చూడాలి.
Also Read: Pawan Kalyan: చిరంజీవి మూవీ ప్లేస్ లో పవన్ సినిమా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి