Aandhi: ఇందిరాగాంధీని భయపెట్టిన 'ఆంధీ'
ABN , Publish Date - Feb 18 , 2025 | 10:11 PM
అధికారంలో చేతిలో ఉండాలే కానీ, ఆకాశాన్ని దించేయవచ్చు అనే భావన కొందరిలో నెలకొంటుంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రకృతి నేలపైకి దించి తీరుతుంది. ఈ మాటలు కళ్ళు నెత్తికెక్కిన వారందరికీ వర్తిస్తాయి.
అధికారంలో చేతిలో ఉండాలే కానీ, ఆకాశాన్ని దించేయవచ్చు అనే భావన కొందరిలో నెలకొంటుంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రకృతి నేలపైకి దించి తీరుతుంది. ఈ మాటలు కళ్ళు నెత్తికెక్కిన వారందరికీ వర్తిస్తాయి. 1975 సంవత్సరం అప్పటి ప్రధాని ఇందిరాగాంధి అదే తీరున ప్రవర్తించారు. ఆ రోజుల్లో ఓ చిత్రంలోని ప్రధాన పాత్ర తన పోలికలతో ఉందని తెలిసిన ఇందిరాగాంధి ఆ సినిమానే నిషేధించారు. ఆ సినిమాయే యాభై ఏళ్ళ క్రితం అంటే 1975 ఫిబ్రవరి 14న రిలీజయిన 'ఆంధీ'(Aandhi). సంజీవ్ కుమార్, సుచిత్రాసేన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన 'ఆంధీ' చిత్రాన్ని ప్రముఖ రచయిత గుల్జార్ దర్శకత్వంలో ఓమ్ ప్రకాశ్ నిర్మించారు. ఇందులోని నాయిక రాజకీయ నాయకురాలు. ఆమె గెటప్ ను అప్పటి ప్రముఖ రాజకీయ నాయకురాళ్ళయిన తారకేశ్వరి సిన్హా, ఇందిరాగాంధిని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించారు. దర్శకుడు తమ పాత్ర ప్రేక్షకుల్లో గుర్తింపు పొందడానికే ఆ రోల్ ను అలా తీర్చిదిద్దారు. అంతే తప్ప అందులో ఇందిరాగాంధిని దూషించింది లేదు, ఆమె వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించిన అంశాలూ లేవు. అయినా తనను పోలిన గెటప్ తో ఓ సినిమా హీరోయిన్ తెరపై కనిపించడం ఇందిరాగాంధికి నచ్చలేదు. అందునా దేశప్రధాని ఆమె కన్నెర చేస్తే ఏమవుతుందో అదే జరిగింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం వాటిల్లేలా 'ఆంధీ' రూపొందిందని, అది సహించరానిదంటూ ఎన్నికల కమీషన్ 'ఆంధీ' ప్రదర్శనను నిషేధించింది. అప్పటికి ఇంకా దేశంలో 'ఎమర్జెన్సీ' (Emergency) ప్రవేశ పెట్టలేదు. కానీ, అనధికారికంగా ఎమర్జెన్సీలాగే ప్రవర్తిస్తూ 'ఆంధీ'ని థియేటర్లలో ప్రదర్శించకుండా ఆపేశారు. (Aandhi completes 50 Years)
ఇంతకూ 'ఆంధీ'లోని కథాంశమేంటంటే - ఓ రాజకీయ నాయకురాలు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఊరికి వచ్చి, ఓ హోటల్ లో దిగుతుంది. అప్పటికే పదేళ్ళుగా భర్త, బిడ్డను కొన్ని కారణాల వల్ల వదిలేసి ఉంటుంది. ఆ హోటల్ మేనేజర్ గా ఆమె భర్త జే.కె. పనిచేస్తుంటాడు. అక్కడ వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం, జనం తప్పుగా భావించడం జరుగుతాయి. ప్రత్యర్థులు బురద చల్లుతారు. ఆమె జనానికి తన కథ చెప్పుకుంటుంది. జనం కోసమే కుటుంబానికి దూరమయ్యాననీ అంటుంది. ఇకపై భర్త, కూతురుతో ఆనందంగా ఉండాలని ఆశిస్తుంది. జనం ఆమె కథ విని, ఆమెనే గెలిపిస్తారు. భర్త కూడా ఆమెకు మద్దతు పలుకుతాడు. గెలిచిన ఆమెను చట్టసభలకు పంపుతూ భర్త వీడ్కోలు పలకడంతో కథ ముగుస్తుంది.
ఈ కథలో ఎక్కడా ఇందిరాగాంధి జీవితానికి సంబంధించిన అంశాలు లేవు. కేవలం ఆమె గెటప్ ను అనుకరించారన్న నెపంతో 'ఆంధీ' ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సినిమా విడుదలైన నాలుగు నెలలకే అంటే 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ అమలు రేశారు. ఆ పై 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధి కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలయింది. ఆమె కూడా ఓ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 'ఆంధీ'పై నిషేధం ఎత్తివేసి ప్రదర్శనకు చోటిచ్చారు. అప్పటికే ఈ సినిమాపై అభిమానం పెంచుకున్న జనం 'ఆంధీ'ని విజయపథంలో పయనింప చేశారు.
'ఆంధీ' చిత్రంలో నాలుగు పాటలే ఉన్నా, అన్నీ సందర్భోచితంగా సాగాయి. పాటలను దర్శకుడు గుల్జార్ కలం పలికించింది. వాటికి ఆర్.డి.బర్మన్ సమకూర్చిన బాణీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి "తెర బినా జిందగీ సే..." పాట ఈ నాటికీ అభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం!