Aamir Khan: ఇష్టపడిన మనిషి లేకుండా.. తట్టుకోవడం నా వల్ల కాలేదు
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:28 PM
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుదిరిన ప్రతిసారీ తన మాజీ భార్య రీనా దత్తా (Reena) గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి ఆమె గురించి ప్రస్తావించారు.
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుదిరిన ప్రతిసారీ తన మాజీ భార్య రీనా దత్తా (Reena) గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి ఆమె గురించి ప్రస్తావించారు. ఆమెను తాను ఎంతగానో ప్రేమించినట్లు చెప్పారు. ‘‘ఎంతో ఆనందంగా ఇద్దరం జీవితాన్ని ప్రారంభించాం. కానీ అనుకోని విధంగా విడాకులు తీసుకోవలసి వచ్చింది. అది నా జీవితంలో ఊహించని పరిణామం. విడాకుల కారణంగా మద్యానికి బానిసయ్యాను. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. రీనాతో విడిపోయిన సమయంలో నేనెంతో బాధపడ్డా. సుమారు మూడేళ్లపాటు అలాగే గడిపా. పని మీదకు ధ్యాస వెళ్లేది కాదు. దాంతో షూటింగ్స్‌కు దూరంగా ఉన్నా. స్ర్కిప్ట్స్ వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడే వాడిని.. నిద్ర పట్టేది కూడా కాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం తాగడం అలవాటు చేసుకున్నా(Reena Datta).
అసలు ఆల్కహాల్ గురించి ఏమీ తెలియని నేను ఉన్నట్టుండి రోజుకో బాటిల్ తాగడానికి అలవాటు పడ్డా. ఒక విధంగా చెప్పాలంటే ఏడాదిన్నరపాటు దానికి బానిసయ్యా. దేవదాస్‌లా అయ్యా. మానసిక కుంగుబాటుకు గురయ్యా. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎక్కువ సమయమే పట్టింది. మెల్లగా నా పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని తెలుసుకున్నా’’ అని అన్నారు. 1986లో ఆమిర్ ఖాన్ - రీనాదత్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె ఐరా, కుమారుడు జునైద్ ఉన్నారు. 2002లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం ఆమిర్.. కిరణ్‌రావును వివాహం చేసుకున్నారు. 2021లో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆయన గౌరీ అనే స్నేహితురాలితో రిలేషన్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.