Yearender 2024 : పల్లె కథకు ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 28 , 2024 | 02:05 AM
సెప్టెంబరులో రిలీజ్ అయిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని నాగబాబు కూతురు నిహారిక నిర్మించారు. గోదావరి జిల్లాలోని పురుషోత్తమపల్లె అనే గ్రామానికి సంబంధించిన కథ.
తెలుగు ప్రేక్షకులు పల్లె కథలకు పట్టం కట్టారు. విలేజ్ బ్యాక్‌డ్రా్‌పలో వచ్చిన చిత్రాలను ఆదరించారు.పల్లెటూరు నేపథ్యం, మంచి కథ, బెస్ట్ విజువలైజేషన్ ఉంటే చాలు... అవి చిన్న సినిమాలైనా పెద్ద విజయాలనే నమోదు చేశాయి. మొన్నటి సాయి దుర్గాతేజ్ ‘విరూపాక్ష’ మొదలు... నేటి కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా వరకు ప్రేక్షకుల మెప్పు పొందాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్ జానర్‌లో ఈ ఏడాది వచ్చిన అలాంటి ఓ ఐదు సినిమాలు ఏవో చూద్దాం!
జాతర, ఎన్నికల చుట్టూ..
సెప్టెంబరులో రిలీజ్ అయిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని నాగబాబు కూతురు నిహారిక నిర్మించారు. గోదావరి జిల్లాలోని పురుషోత్తమపల్లె అనే గ్రామానికి సంబంధించిన కథ. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక సారి భరింకాళమ్మ జాతర జరుగుతుంది. ఈసారి ఉప సర్పంచ్ ఎన్నికలకు పదిరోజుల ముందు జాతర జరగాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ... ప్రస్తుత సర్పంచ్ పొలిశెట్టి బుజ్జిపై పోటీకి నిలబడేందుకు ముందుకు వస్తాడు. గత జాతర సమయంలో కమిటీ కుర్రోళ్లు(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి జాతర జరిగేంత వరకూ ఎన్నికల ప్రచారం చెయ్యొద్దని ఆ ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ 90వ దశకానికి చెందిన వారంతా తమ బాల్యాన్ని నెమరు వేసుకుంటారు. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండునని ఆశపడతారు. ప్రేక్షకుల్ని బాల్యంలోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ యదు వంశీ ప్రేక్షకులను మెప్పించగలిగారు.
పెళ్లి నేపథ్యం
అక్టోబరులో విడుదలైన ‘లగ్గం’ సినిమాకు దర్శకుడు రమేశ్ చెప్పాల. తెలంగాణాలో జరిగే పెళ్లి నేపఽథ్యంలో కథ సాగుతుంది. ఇక్కడి పెళ్లిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాలను తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే...తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామంలో సదానందం, అతని కూతురు మానస నివసిస్తుంటారు. మేనల్లుడు చైతన్య. అల్లుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఉందని లగ్గం ఖాయం చేస్తాడు సదానందం. అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది. ఈ పరిస్థితుల్లో వారి పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే కథ. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ పాటలన్నీ గ్రామీణ నేపథ్యాన్ని అల్లుకునే ఉన్నాయి. క్లయిమాక్స్‌లో పెళ్లి కూతురు అప్పగింత ఎపిసోడ్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది.
పల్లె కథ
1980లో తెలంగాణలోని ఒక పల్లెకు సంబంధించిన కథ ‘పొట్టేల్’. వంశపారంపర్యంగా ఆ ఊరి పటేళ్లకి అమ్మవారు పూనుతూ ఉంటుంది. ఆ సమయంలో పటేళ్లు ఏది చెబితే అదే వేదం. కొత్త పటేల్ నిమ్న వర్గాల వారిని బడికి వెళ్లకూడదని ఆ పూనకంలో ఆదేశిస్తాడు. కాని గంగాధర్ తన కూతురు సరస్వతిని చదివించాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇది పూర్తిగా ఒక గ్రామానికి సంబంధించిన స్టోరీ.
1977 నాటి కథ
కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా కథ అంతా 1977 బ్యాక్‌డ్రా్‌పలో జరుగుతుంది. అనాథ అయిన హీరోకు చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. పోస్ట్ మ్యాన్ అయితే అందరి ఉత్తరాలు చదవొచ్చు అనే ఆలోచనతో కృష్ణగిరి అనే గ్రామంలో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. వారిని కిడ్నాప్ చేసిందెవరు?కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు?ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న హీరోకు తెలిసిన విషయాలేమిటి? అనే అంశాల చుట్టూ కథ అల్లారు దర్శకులు. ఈ సినిమా కిరణ్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం ‘ఈసారైనా’. విప్లవ్ ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శుకుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా కూడా వ్యవహరించారు. ఈ మూవీలో హీరో నాలుగేళ్లుగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరిలో పనిచేస్తున్న టీచర్‌తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి మాత్రం గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లిచేస్తానని హీరోకు కండీషన్ పెడతాడు. హీరో జాబ్ కొట్టాడా లేదా? చివరకు ఏమైందనేది స్టోరీ. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం మొత్తం షూటింగ్‌ను ఒక పల్లెటూరిలోని అద్బుతమైన లోకేషన్లలో చిత్రీకరించారు. పచ్చని పలెటూరిలో ప్రశాంతంగా సాగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది.