Yearender 2024 : ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:47 PM
Rewind 2024: క్యాలెండర్ 2024 పూర్తి కావొచ్చింది. చూస్తుండగానే ఏడాది తిరిగొచ్చేసింది. ఒకరకంగా తెలుగు చిత్రసీమ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నట్లే. ఈ ఏడాది కాలంలో బాక్సాఫీస్ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి
2024 క్యాలెండర్ పూర్తి కావొచ్చింది. చూస్తుండగానే ఏడాది తిరిగొచ్చేసింది. ఒకరకంగా తెలుగు చిత్రసీమ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నట్లే. ఈ ఏడాది కాలంలో బాక్సాఫీస్ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉంది? అన్నది చూద్దాం. అగ్ర తారల చిత్రాలంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. బాక్సాఫీస్‌కు నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. 2024లో టాప్ హీరోల సినిమాల సందడి ఎలా ఉందంటే.. (Tollywood Rewinder 2024)
పెద్దోడు.. చిన్నోడు పోటీ పడ్డారు...
ఈ ఏడాది విడుదలైన తొలి, భారీ చిత్రం మహేశ్ బాబు నటించిన 'గుంటూరుకారం’. సంక్రాంతి పండగ బరిలో దిగింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనగానే అందరిలో ఓ ఆసక్తి. టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సోషల్ మీడియా ఇరగదీసింది. మహేష్ మాస్ అవతార్ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. అయితే తెరపై సినిమా చూస్తే.. తీవ్ర నిరాశ ఎదురైంది, ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ రివ్యూలు, టాక్ స్ర్పెడ్ అయింది. మహేశ్ అభిమానులు సైతం నిరాశ చెందారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అన్నట్లు సినిమా రిజల్ట్ ఉండి. ఫ్యామిలీ సినిమాకి మాస్ టైటిల్, మాస్ ప్రమోషన్స్ చేయడంలో పొరపాటు జరిగుంటుదని స్వయంగా నిర్మాత నాగవంశీ రిజల్ట్‌ను రివ్యూ చేసుకున్నారు. మహేశ్, త్రివిక్రమ్‌ల కాంబోలో హ్యాట్రిక్ హిట్ ఫెయిల్ అయింది. (Year Ender 2024)
ఇదే సంక్రాంతికి చిన్నోడితో పాటు పెద్దోడు వెంకటేశ్ కూడా బరిలో దిగారు. ఆయన నటించిన 'సైంధవ్' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఎన్నో ఏళ్లగా వెంకటేష్‌కి సంక్రాంతి మంచి సెంటిమెంట్ సీజన్. పెద్ద పండుగకు రిలీజ్ అయిన ఆ చిత్రాలు ఆల్మోస్ట్ సూపర్ హిట్టే. కానీ ఈ సంక్రాంతి ఆయనకు ఏమాత్రం కలిసి రాలేదు.' సైంధవ్' మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఒక యూనిక్ పాయింట్ ఉన్న సినిమా. వెంకటేష్ చాలా కొత్తగా కనిపించారు. కానీ సినిమా నిలబడలేకపోయింది. హిట్ సిరీస్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న శైలష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి మూడ్‌కి సింక్ కాలేదు. మామూలు సీజన్‌లో విడుదల చేసి ఉంటే రిజల్ట్ బావుండేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్‌గా పెద్దోడు - చిన్నోడు ఇద్దరూ కూడా సంక్రాంతిని సక్సెస్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. (Year Ender 2024)
సామిరంగా అనిపించారు..
ఇదే సంక్రాంతికి జనవరి 14న నాగార్జున ‘నా సామిరంగ’తో వచ్చారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన చిత్రమిది. పక్కాగా పండగ సినిమా ఇది. కథ కూడా భోగి, సంక్రాంతి కనుమ చుట్టూ తిరుగుతుంది. పాటల్లో, బ్యాక్‌డ్రాప్‌లో పండగ కళ కనిపించింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు కానీ పండుగ వైబ్ అయితే తెచ్చింది. ఈ మధ్య కాలంలో నాగార్జునకి ఒక మంచి హిట్, రిలీఫ్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. కేవలం 70 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి యుద్థ ప్రాతిపదికన సంక్రాంతి టార్గెట్ చేసుకొని సినిమాని రిలీజ్ చేయడం మరో విశేషం. ఎలాంటి నష్టాలు లేకుండా గట్టెక్కింది.
రవితేజకు కలిసిరాలేదు...
ఏ ఏడాది మాస్ మహారాజా రవితేజ నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్' రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. ఈగల్ సంక్రాంతికి రావాల్సింది. థియేటర్స్ కొరత వల్ల వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరిలో విడుదల అయ్యింది. సోలో డేట్ దొరికినప్పటికీ సినిమా బాక్సాఫీసు ముందు నిలబడలేకపోయింది. బాలీవుడ్ రైడ్ సినిమాని రవితేజతో 'మిస్టర్ బచ్చన్’గా రీమేక్ చేశాడు హరీష్ శంకర్. పాటలు,, ప్రోమోలు. పవర్‌ఫుల్ డైలాగ్‌లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తీరా సినిమా మాత్రం దారి తప్పింది. ఈ రెండు సినిమాల్ని నిర్మించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నష్టాల పాలైంది.
15 రోజుల్లో 1000 కోట్లు...
జూన్‌లో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి’ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే భారీ విజయం అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ మరో హిట్ కొట్టారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సౌత్ ఇండియా హీరోలలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రెండుసార్లు రాబట్టిన తొలి హీరోగా ప్రభాస్ కల్కితో రికార్డ్ సృష్టించారు. ‘బాహుబలి2’ 10 రోజుల్లో రూ.1000 కోట్లు వసూలు చేస్తే, ‘కల్కి’కి 15 రోజుల్లో ఆ రికార్డ్‌ని అందుకుంది. అలాగే నార్త్ అమెరికాలో 17 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగానూ (నాన్-బాహుబలి) రికార్డును బద్దలు కొట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మించారు.
52 కేంద్రాల్లో 50 రోజులు..
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. రిలీజ్‌కు ముందే అనేక రికార్డులు బద్దలు కొట్టింది దేవర. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీేసల్ ద్వారా 1 మిలియన్ డాలర్లకు చేరిన ఫస్ట్ ఇండియా మూవీగానూ అరుదైన రికార్డు సృష్టించింది. అయితే విడుదల రోజు నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ చరిష్మా సినిమాను ముందుకు తీసుకెళ్లింది. కలెక్షన్ల విషయంలో వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్లుపై గ్రాస్ సాధించింది. దేవర 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం.
పుష్ప రాజ్ సత్తా...
ఇక ఈ ఏడాది చివరికొస్తే విడుదలైన భారీ చిత్రం 'పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.’ తెలుగులో సినిమాకు నెగటివ్ టాక్ ఉన్నా, ఉత్తరాదిలో మాత్రం ఏ రేంజ్‌లో విజృభించింది. అల్లు అర్జున్ పాన్ ఇండియాలో మాస్ విజయాన్ని అందుకున్నారు. కేవలం ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప2 .. ఇండియా సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డ్‌ని సృష్టించింది. పుష్ప స్వాగ్ మ్యానరిజంకు మరోసారి ఫిదా అయ్యారు. ప్రస్తుతం సినిమా బాక్సాఫీసు వద్ద నిలకడగా ఆడుతోంది. 2024 ప్రారంభం నుంచి అంతంత మాత్రంగా ఉన్న పెద్ద సినిమాల హడావిడి కల్కి, పుష్ప-2 చిత్రాలతో రెట్టింపు ఎనర్జీ ఇచ్చాయి. చివర్లో పుష్పరాజ్ 2024కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చారు.
ఇక అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణల నుంచి ఈ ఏడాది సినిమాలు రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్‌కు గ్యాప్ వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ ఛేంజర్’ ఇప్పటికే విడుదల కావాలి. కానీ కొన్ని కారణల వల్ల ఆలస్యమైంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నుంచి సినిమా రాలేదు. కానీ 2024 ఆయనకి మైల్ స్టోన్ ఇయర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పవన్. ఆయనకి, ఆయన అభిమానులకు ఇదో గొప్ప సంవత్సరంగా గుర్తుండిపోతుంది.