Yearender 2024: 2024లో వీరే కోలీవుడ్ ఆణిముత్యాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:47 AM
ప్రతి ఇండస్ట్రీలో ఒక సంవత్సరం ఒకలా, ఇంకో సంవత్సరం మరోలా అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఆ అదృష్టం వరించిన వారు.. ఆ ఇండస్ట్రీకి ఆ ఇయర్ ఆణిముత్యాలుగా చెప్పుకోబడతారు. అలా కోలీవుడ్‌లో 2024లో ఆణిముత్యాలుగా చెప్పుకోదగిన ఐదుగురు సినీ ప్రముఖులు ఎవరంటే..
యేటా వందలాది చిత్రాలు విడుదలవుతుంటాయి. ఎంతో మంది కొత్త దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు వెండితెరకు పరిచయమవుతూ, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. ఇలాంటి వారిలో అతి కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. దర్శకత్వం, సంగీతం, హీరో, హీరోయిన్, కథ విభాగాల్లో 2024 కోలీవుడ్ ఆణిముత్యాలుగా గుర్తింపు పొందిన వారి వివరాలను పరిశీలిద్ధాం.
తమిళరసన్ పచ్చముత్తు (దర్శకత్వం)...
ఎప్పటిలాగే 2024లో అనేక మంది కొత్త దర్శకులు తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. వీరిలో ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకున్న నూతన దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు. ఒక నాణ్యమైన చిత్రానికి స్టార్ రేంజ్ అక్కర్లేదని నిరూపించారు. హరీష్ కళ్యాణ్, సంజనా కృష్ణమూర్తి, అట్టకత్తి దినేష్, స్వాసికలను ప్రధాన పాత్రధారులుగా చేసి ఆయన తెరకెక్కించిన ‘లబ్బర్ పందు’ చిత్రం సూపర్‌హిట్ సాధించడంతో పాటు ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేశారు.
జీవీ ప్రకాష్ కుమార్ (సంగీతం)
2006లో వచ్చిన ‘వెయిల్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ సంగీత దర్శకుడు కమ్ హీరో తన సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గత 18 యేళ్ళ కాలంలో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇపుడు తన వందో చిత్రానికి సంగీతం స్వరాలు సమకూర్చే పనిలో నిమగ్నమైవున్నారు. అయితే, ఈ యేడాది ‘కెప్టెన్ మిల్లర్’, ‘మిషన్ చాప్టర్-1’, ‘సైరన్’, ‘రెబల్’, ‘కల్వన్’, ‘డియర్’, ‘తంగలాన్’, ‘అమరన్’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. వీటిలో ‘అమరన్’ చిత్రానికి అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాల సమయంలో జీవీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. నటుడుగా ఒక వైపు రాణిస్తూనే తన అద్భుతమైన సంగీత మేథస్సుతో ఎన్నో చిత్రాలకు మంచి సంగీతం అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు.
విజయ్ సేతుపతి (హీరో)...
2018లో వచ్చిన ‘96’ అనే మూవీ తర్వాత విజయ్ సేతుపతి నటించిన అనేక చిత్రాలు వాణిజ్యపరంగా నిరాశపరిచాయి. హీరోగా కూడా నిలదొక్కుకోలేకపోయారు. దీంతో తన పంథా మార్చుకుని ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో మరో నట విశ్వరూపాన్ని (విలన్) చూపించారు. అప్పటి నుంచి విజయ్ సేతుపతికి తిరుగులేకుండా పోయింది. అదేసమయంలో తనకు నచ్చిన కథా చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాంటి చిత్రమే ‘మహారాజ’. ఈ చిత్రం విజయ్ సేతుపతి విజయ దాహాన్ని తీర్చిందని చెప్పొచ్చు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.వందల కోట్లను వసూలు చేసింది.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
సూరి (కమెడియన్ కమ్ కథానాయకుడు)
తమిళ చిత్రపరిశ్రమలో సహాయ నటుడిగా పరిచయమై, కొన్ని చిత్రాల్లో ఒకే ఒక్క సీన్‌లో కనిపించి, ఆ తర్వాత హాస్య నటుడిగా తన సత్తా చాటిన నటుడు సూరి. ‘విడుదలై-1’ మూవీతో హీరోగా మారారు. ఈ యేడాది సూరి కథలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నటించిన చిత్రానికి మంచి ఉదాహరణ ‘కొట్టుకాలి’. అలాగే, ‘గరుడన్’, ‘విడుదలై-2’ సినిమాలు కూడా సూరి నటనకు అద్దంపట్టాయి. హాస్య నటుడు హీరోగా మారిన తర్వాత మూస ధోరణిలో పాత్రలను ఎంచుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చే కథా పాత్రలను ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నారు.
సాయిపల్లవి (హీరోయిన్)
తమిళ భాష బాగా తెలిసిన, బాగా మాట్లాడగలిగిన హీరోయిన్లకు కోలీవుడ్ బాసటగా నిలబడదు. పరభాషా చిత్రాలకు చెందిన హీరోయిన్లకు మాత్రమే పెద్ద పీట వేస్తుంది. అదే పరిస్థితి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయిపల్లవికి ఎదురైంది. కోలీవుడ్‌లో మినహా తెలుగు, మలయాళ భాషల్లో అగ్రస్థాయిలో ఉంది సాయిపల్లవి. ఆమెలోని టాలెంట్‌ను ఏ ఒక్క కోలీవుడ్ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోయారన్న విమర్శ ఉంది. ఆ లోటుని ‘అమరన్’ తీర్చేసింది. ఈ చిత్రంలో చివరి అరగంట సాయిపల్లవి నటనకు తెలియకుండానే ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి.