Tollywood: అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు

ABN , Publish Date - Oct 03 , 2024 | 02:04 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ (konda Surekha) వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు సీనియర్‌ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ (konda Surekha) వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు సీనియర్‌ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja). బాధ్యతగల పదవిలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. మంత్రిగా కొండా సురేఖకు ఏం తెలుసో తెలీదో గానీ.. ముందు గైడ్‌ లైన్స్‌ ఫాలో కావాలని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ సినిమా ఇండస్ట్రీలో వారిని టార్గెట్‌ చేసి మాట్లాడటం తమాషా అయిపోయిందంటూ మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ, అందులో పని చేసే వారంటే ఎందుకు అంత చులకన అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటివి రిపీట్‌ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు..
మరో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా ఘాటుగా స్పందించారు. "అక్కినేని నాగార్జున కుటుంబం పై కొండా సురేఖ మాట్లాడిన తీరు చాలా బాధాకరం.  రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్‌ చేయడం శోచనీయం. రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ మొదటగా ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడటం తప్పుడు సంప్రదాయం. సురేఖ గారు ఇది మొదలెట్టింది మీరే.. దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే’’ అని హరీశ్‌ శంకర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

పురోగతిపై దృష్టి పెట్టండి..
"మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన పరుషమైన, అనవసరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కినేని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా ఒక మహిళ గురించి చెడుగా మాట్లాడడం ఆమోదయోగ్యం కాదు. సినీ వర్గాల్లో భాగంగా ఈ తరహా ప్రవర్తనను సహించబోం. రాజకీయ లబ్ధి కోసం సినీ సెలబ్రిటీలను, వారి కుటుంబాలను సాఫ్ట్‌ టార్గెట్‌గా చేసుకోవడం మానేయాలి. పురోగతి, అభివృద్థిపై దృష్టి కేంద్రీకరించండి. కానీ ఇలాంటి అర్థంలేని వాటిపై కాదు’’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు.

 
"కొండా సురేఖ చేసిన నిరాధార వ్యాఖ్యలు బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాల్‌తో కూడుకున్నదో మీకు తెలుసు. మీ రాజకీయ లబ్థి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్ర్తీ ద్వేషం, తప్పుడు ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. తన పార్టీలోని నాయకులు ఇటువంటి నష్టపరిచే వ్యూహాలకు దూరంగా ఉండేలా చూడాలని కూడా నేను రాహుల్‌ గాంధీని అభ్యర్థిస్తున్నాను.  భవిష్యత్‌ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేస్తే సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వస్తుంది’’ అని మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు.

 

Updated Date - Oct 03 , 2024 | 02:04 PM