Vyuham: ఆర్జీవీ ‘వ్యూహం’.. హైకోర్టులో షాకుల మీద షాకులు
ABN , Publish Date - Feb 05 , 2024 | 07:18 PM
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోమారు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. చిత్రాన్ని మరోమారు వీక్షించి సెన్సార్ బోర్డు కమిటీ రిపోర్ట్ సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)కు మరోమారు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. గత నెలలో వ్యూహం (Vyuham) సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేయగా ఆయన వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. వ్యూహం సినిమాను ఓ కుటుంబాన్ని కించపరుస్తూ నిర్మించారని, ఎలాంటి అనుమతులు లేకుండా క్యారెక్టర్స్ ను కావాలని చెడుగా చూపించారని, సినిమా రిలీజ్ సమయంలో సెన్సార్ బోర్డు వేటిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. కాబట్టి వ్యూహం సినిమా విడుదల చేయకుండా చూడాలని గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్.. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని రద్దు చేస్తూ, నాలుగు వారాల్లో సినిమాను సెన్సార్ బోర్డు రివ్యూ చేసి రిపోర్టు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ఫిబ్రవరి 11 వరకు సినిమా విడుదలను నిలిపివేస్తు గత నెల 22న తీర్పును ప్రకటించింది.
అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో ప్రతి సినిమాకు రివైజింగ్ కమిటీ కారణాలు పేర్కొనాల్సిన అవసరం లేదంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma), రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ హైకోర్టులో అప్పీల్ చేయగా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సీజే జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ జే అనిల్‌కుమార్ ధర్మాసనం బుధ, గురువారాల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న బెంచ్ ఈ చిత్రాన్ని మరోమారు వీక్షించి ఈ నెల 9వ తేదీలోగా సెన్సార్ బోర్డు కమిటీ రిపోర్ట్ సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.