Vyooham: వర్మ సినిమాకి ఎదురు దెబ్బ, మరోసారి సెన్సారు చెయ్యాలని ఆదేశాలు

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:27 PM

రామ్ గోపాల్ వర్మ సినిమా 'వ్యూహం' సినిమాకి హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడిచ్చిన సెన్సారు సర్టిఫికెట్ ని రద్దు చేస్తూ, ఈ సినిమాని మరోసారి సెన్సారు చేయవలసిందిగా కోర్టు ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాలుంటే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Vyooham: వర్మ సినిమాకి ఎదురు దెబ్బ, మరోసారి సెన్సారు చెయ్యాలని ఆదేశాలు
Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ రాజకీయ నేపధ్యంగా తీసిన సినిమా 'వ్యూహం' కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు తెలంగాణ హై కోర్ట్ ఈ సినిమాకి నిలుపుదలని నిలిపివేసింది. ఈ సినిమాకి మరోసారి సెన్సారు చెయ్యాలని, అందులో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీని జస్టిస్ సూరేపల్లి నందా ఆదేశించారు. మూడు వారాల్లోగా కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని ప్యానెల్‌కు తెలిపింది.

థియేటర్లలో సినిమా విడుదలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 11న కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఆంద్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలపై సినిమా ప్రభావం చూపుతుందని భావిస్తే, తెలంగాణలో విడుదలకు అనుమతి ఇవ్వాలని నిర్మాత తరపు న్యాయవాది ఎ వెంకటేష్ కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది.

ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబరు 28న, రివైజింగ్ కమిటీ ఎగ్జిబిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయడానికి కారణాలను పేర్కొనడంలో విఫలమైందనే కారణంతో హైకోర్టు విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది, పెద్దగా తొలగింపులు లేదా మార్పులు చేయనప్పటికీ రివైజింగ్ కమిటీ సర్టిఫికేట్‌ను మంజూరు చేసిందని కోర్టు గమనించింది.అలాగే సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రివైజింగ్ కమిటీ, నిర్మాతలను కోర్టు ఆదేశించింది.

RGV.jpg

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు కూడా రాజకీయ నేపధ్యం వున్న సినిమాలని తెరకెక్కించారు. అయితే వర్మ వైస్సార్సీపీ కి అనుకూలంగా తన సినిమాలు ఉండేట్టు తీస్తున్నారు అని ఒక ఆరోపణ వుంది. ఇప్పుడు ఈ 'వ్యూహం' సినిమాలో కూడా ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత జరిగిన సంఘటనల ఆధారంగా తనకి తెలిసిన విధంగా ఈ సినిమాలు చూపించాను అని వర్మ చెప్పారు. అయితే అవి నారా చంద్రబాబు నాయుడుని, లోకేష్, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీ నాయకులను కించపరిచే విధంగా ఈ సినిమా చూపించినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

అది తెలిసి ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సినిమా థియేట్రికల్ విడుదలకు సంబంధించిన సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సినిమా మొత్తం చంద్రబాబు నాయుడుపై పరువు నష్టం కలిగించే విధంగా ఉందని టీడీపీ తరపు న్యాయవాది వాదించారు. ఈ చిత్రంలో నాయుడుని ప్రతినాయకుడిగా, జగన్ మోహన్ రెడ్డిని కథానాయకుడిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జనవరి 2న చిత్ర నిర్మాత హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. విడుదల తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల చిత్ర నిర్మాతకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.

Updated Date - Jan 22 , 2024 | 02:27 PM