HBD Rajinikanth: ‘దేవుడు శాసించాడు. ఈ అరుణాచలం పాటించాడు’..
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:34 AM
‘దేవుడు శాసించాడు. ఈ అరుణాచలం పాటించాడు’ అంటూ రజనీ డైలాగ్ చెబుతుంటే అభిమానులు ఆనందానికి హద్దే ఉండదు. ఇది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు.. ఆయన పాటించే నియమం కూడా.
‘దేవుడు శాసించాడు. ఈ అరుణాచలం పాటించాడు’ అంటూ రజనీ (Rajinikanth) డైలాగ్ చెబుతుంటే అభిమానులు ఆనందానికి హద్దే ఉండదు. ఇది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు.. ఆయన పాటించే నియమం కూడా. మన జీవితంలో జరిగే ఏదైనా భగవంతుడి ఆజ్ఞతోనే జరుగుతుందని ఆయన నమ్మకం. దేవుడిచ్చిన లైఫ్‌ను కష్టం, నమ్మకం అనే పునాది వేసి ఒక్కో మెట్టూ ఎక్కిన స్టార్ ఆయన. పేరు మూడక్షరాలే కావచ్చు. కానీ రజనీ ఒక బ్రాండ్. ఆ పేరు వెనక చెప్పలేనంత స్టార్‌డమ్ ఉంది. సిల్వర్ స్ర్కీన్‌పై ఆయన కనిపిస్తే చాలు అభిమానులకు పండగే. నిర్మాతలకూ పెద్ద పండగే,చ, కాసుల వర్షం కూడా. ఆయన బాడీ బిల్డర్ కాదు.. మంచి రంగూ కాదు. ఆరగడులు ఆజానుబావుడు కాదు.. నల్లగా, బట్టతలతో సాధారణంగా ఉంటారు. కానీ ఆయన స్టైల్, మేనరిజం ఎవర్‌గ్రీన్. ఎవరికి రానిది, సాధ్యపడనిది. ఎలాంటి వారినైనా మంత్రముగ్థులను చేయగల సమ్మోహన శక్తి ఆయనకుంది. ఆనందాలకు పొంగిపోడు.. బాధల్లో కుంగిపోడు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రజనీ కెరీర్‌లో ఆసక్తికర అంశాలను గుర్తు చేసుకుందాం. (Happy Birthday Thalaiva)
రజనీ నటుడి అందరికీ తెలుసు. మరి నటుడు కాకముందు? రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. బెంగళూరు జన్మించారు. రాణోజీరావు, రాంబాయి దంపతులకు పుట్టిన శివాజీరావ్.. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఇంట్లో ఎన్నో గొడవలు, దూషణలు ఎదురవడంతో చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. ‘ఎంత చెడ్డవారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పొస్తుంది’ అన్నది శివాజీరావ్ విషయంలోనూ నిజమైంది. రామకృష్ణ మఠం ఆయనలో సత్ప్రవర్తన, ఆధ్యాత్మికత అనే బీజాలను నాటింది. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో శివాజీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ తర్వాత చదువు కొనసాగలేదు. దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ క్రమంలో కేఎస్ ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా మారారు. బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనలోని కళాకారుడిని ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ. చిన్నతనం నుంచే ఆడపాదడపా నాటకాలు వేసేవారు. ప్రతి నాటకంలోనూ ఆయనకుంటూ ప్రత్యేక శైలి ఉండేది. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఓసారి నాటకంలో దుర్యోధనుడి పాత్రలో రజనీని చూసిన అతని ేస్నహితుడు రాజ్ బహదూర్ ఆ నటనకు మంత్ర ముగ్థుడై డబ్బులిచ్చి మరీ శివాజీని మద్రాసు పంపాడు. మద్రాసు చేరుకున్న శివాజీ నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత అవకాశాల వేట మొదలైంది. ఏవీఎం, జెమిని, విజయ వాహిని ఏ స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అవకాశాలు రాలేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఉన్న ఉద్యోగం పోయింది. ‘ఈ బతుకు బతికి వేస్ట్’ అనుకుంటూ చివరిగా తన స్నేహితుడిని కలిసేందుకు బెంగళూరు వెళ్లారు. రైలు దిగిన వెంటనే ఫ్రెండ్ రమేశ్‌ను కలిశాడు. ఆయన పెయింటర్. శివాజీ రావడం చూసి, కొంచెం ేసపు వేచి ఉండమని సైగ చేశాడు రమేశ్. సరేనని శివాజీ ఒక స్తంభానికి ఆనుకుని కూర్చొని చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో గోడపై గీసిన రాఘవేంద్ర స్వామి బొమ్మను చూసి శివాజీలో తెలియని ఆనందమేదో కలిగింది. ‘నేనున్నా. నీకేం కాదు’ అన్నట్లు అనిపించింది. అప్పటివరకూ శివాజీని ఆవరించిన నిరాశ, నిస్పృహలు చెల్లా చెదురైపోయాయి. పోరాడితే పోయేదేముంది అన్నట్లు శివాజీ ముందుకు కదిలారు.
ఆ స్టైలే వేరు..
‘ఎక్కడికెళ్లాలమ్మా?.. ఈ లగేజీ మీదేనా’ అని బస్ ఎక్కిన వారిని సాదారణంగా అడిగి ఉంటే శివాజీ గురించి మనం చర్చించుకునేవాళ్లమే కాదు. ‘వృత్తే మనకు దైవం’ అని ఆయన తన సినిమా పాటలో చెప్పినట్టే కండక్టర్ విధిని ఎంతో హూందాగా నిర్వర్తించేవారు. శివాజీరావ్ టికెట్టు ఇచ్చే విధానం, ‘రైట్.. రైట్’ అని చెప్పే పద్థతి, ముఖంపైకి దూసుకొచ్చే జుట్టును పక్కకు జరిపే స్టైల్‌కు ప్యాసింజర్స్ ఓ హీరోని చూసినట్టుగా భావించేవారు. అయితే, ప్రయాణికులు సినిమా చూసినట్టు చూసి వదిలేసినా.. బస్ డ్రైవర్ రాజ్ బహదూర్.. శివాజీరావ్ దృష్టిని నాటకాల వైపు మళ్లించాడు. కండక్టర్ పనైనా, నటన అయినా తనకు అన్నీ ఒకటే కాబట్టి శివాజీరావ్ అక్కడా తన మార్క్ చూపించారు. చిన్న పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసారు. కండక్టర్‌గానే శివాజీరావ్ మిగిలిపోకూడదని భావించిన రాజ్ బహదూర్ ఆయన్ను మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటన నేర్చుకునేందుకు ప్రోత్సహించారు. శివాజీకి అండగా నిలిచారు.
మొదటి అవకాశం..
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎగ్జామినర్‌గా వెళ్లిన దర్శకుడు కె. బాలచందర్.. శివాజీరావ్ ప్రతిభ్‌ను తొలి చూపులోనే గుర్తించి నటుడిగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా ‘అపూర్వ రాగంగళ్’తో శివాజీరావ్ తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాతోనే రజనీకాంత్‌గా అవతరించారు. తెలుగు తెరపై ఆయన కనిపించిన తొలి చిత్రం ‘అంతులేని కథ’ (1975). అప్పటి నుంచే రజనీ, టాలీవుడ్ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై సంచలనాలు సృష్టించాయి. తెలుగు హీరోలతోనూ ఆయన కలిసి నటించారు.
1. ఎన్టీఆర్ తో టైగర్
2. కృష్ణతో అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీం
3. శోభన్ బాబుతో జీవన పోరాటం (టి.సుబ్బరామిరెడ్డి నిర్మాత)
4. చిరంజీవితో కాళి
5. కమల్‌హాసన్‌తో వయసు పిలిచింది
6. సుమన్‌తో న్యాయం మీరే చెప్పాలి
7. అమ్మ ఎవరికేౖనా అమ్మ
8. మోహన్‌బాబుతో పెదరాయుడు వంటి తెలుగు చిత్రాలో నటించి తన మార్క్ చూపించారు.
‘పెదరాయుడు’లో రజనీ ఇచ్చిన తీర్పు వింటే ఇప్పటికీ చప్పట్లు కొట్టాల్సిందే. కెరీర్ బిగినింగ్‌లో ప్రతినాయకుడిగానూ కనిపించిన రజనీ ‘భైరవి’ సినిమాతో సోలో హీరో అయ్యారు. కానీ, దాంతో ఆయన ఆనందపడలేదు. మనలో చాలామంది మనల్ని మనమే తక్కువగా చూసుకుంటాం. అలానే రజనీలోనూ న్యూనతాభావం ఉండేది. నల్లగా ఉన్నానని, అందంగాలేనని ఆయన బాధపడేవారు. తర్వాత వాటిని అధిగమించి ప్రత్యేకతను చాటారు. సిగరెట్ గాల్లోకి విసరడం, తువాలుతో కుర్చీలాగడం, కళ్లజోడు పెట్టడం, జుట్టుగా తిప్పడం.. ఇలా రజనీ ఏది చేసినా కళ్లు అప్పగించడమే ప్రేక్షకుల వంతయ్యేది. ‘నా దారి.. రహదారి’ అని ఆయన ఒక్కసారి చెప్పినా వందసార్లు ప్రేక్షకుల చెవుల్లో మారుమోగేది. నటుడిగా సూపర్‌స్టార్‌డమ్ పొందారు. అవార్డులు - రివార్డులు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణాన్ని, కోట్లను సంపాదించారు. అయితే అవేవీ రజనీకాంత్‌కు సంతృప్తినివ్వలేదు. తన గమ్యం ఇంకేదో ఉందని మథనపడేవారాయన. ఆ సంఘర్షణ నుంచి బయటపడేందుకు ఆధ్మాత్మికం వైపు మళ్లారు. అది.. తర్వాత ఆయన నటించిన సినిమాలపై ప్రభావం చూపింది. మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన ‘బాబా’ ఘోర పరాజయాన్ని చూసింది. దాంతో, ‘ఇక రజనీ పని అయిపోయింది’ అనే ప్రచారం జరిగింది. ఆ సంఘటనలకు కుంగిపోయినా తన సినిమా వల్ల నష్టపోయిన వారికి చేయూతనిచ్చి అసలైన ‘తలైవా’ అనిపించుకున్నారు. ‘చంద్రముఖి’తో రజనీ మరోసారి సత్తా చాటారు. తర్వాత ‘శివాజీ’, ‘రోబో’ తదితర చిత్రాలతో తనకు తిరుగులేదని పించుకున్నారు. గత నాలుగేళ్లగా ‘పేట’, ‘దర్బార్’, ‘అన్నాత్తే’ సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పర్చిన రజనీ ‘జైలర్’, వేట్టయాన్ చిత్రాలతో ఆ లోటును తీర్చారు. ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదని చూపించారు.
రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయాలు..
మీరు గుడిలో కూర్చొని ఉన్నప్పుడు యాచకులు వచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే ఏం చేస్త్తారు? కోప్పడతారు కదూ! ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉన్న రజనీ ‘‘నేనేంటో ఆ సంఘటనే తెలియజేస్తుంది. అందుకే పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వను’’ అని అన్నారాయన. ఓసారి బెంగళూరులోని ఓ దేవాలయం బయట కూర్చుంటే ఆయనకు ఈ అనుభవం ఎదురైంది.
‘దళపతి’ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు తెలియక అరవింద్‌స్వామి.. రజనీకాంత్ రూమ్‌కు వెళ్లారు. అక్కడున్న బెడ్‌పై ఆయన నిద్రపోయారు. ఆయన్ను లేపకుండా రజనీ అదే గదిలో నేలపై పడుకున్నారు. అప్పటికి అంతగా గుర్తింపులేని అరవింద్‌స్వామికి రజనీ గౌరవం ఇవ్వడం ఆయనలోని మంచితనానికి నిదర్శనం.
1996 ఎన్నికల సమయంలో రజనీ ఓ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు, మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ ఆయనని కించపరుస్తూ మాట్లాడారు. దాంతో ఎన్నికల తర్వాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రజనీ, స్వయంగా కలగజేసుకుని తన ‘అరుణాచలం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి, తనకు శత్రువులు ఎవరూ ఉండరని చూపించారు.
సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్. ‘ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్‌స్టార్’ పేరుతో సీబీఎస్‌ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఓ పాఠం. ఆయన సంపాదనలో 50 శాతాన్ని ేసవా కార్యక్రమాలకే కేటాయించే రజనీకి ఎప్పటికేౖనా హిమాలయాల్లో స్థిరపడాలని చిరకాల కోరిక.
160 చిత్రాల్లో నటించిన రజనీ పద్మభూషణ్, పద్మ వ్ఘిభూషణ్, దాదా ఫాల్కే అవార్డులు అందుకున్నారు. ‘ఫాల్కే’ అవార్డును తన గురువు బాలచందర్, మిత్రుడు (బస్ డ్రైవర్) రాజ్ బహుదూర్, తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు దర్శకులు, సహనటులు సాంకేతిక నిపుణులు. థియేటర్ల యజమానులు, అభిమానులు, తమిళ ప్రజలకు అంకితమిచ్చారు. ఇది రజనీ వ్యక్తిత్వానికి ప్రతీక.