Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. జనసైనికుల లేఖలు చూసి పవన్ భావోద్వేగం

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:12 PM

అభిమానులు, జనసైనికులు రాసిన కొన్ని లేఖలు తన మనసును కదిలించాయంటూ ట్విట్టర్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వారు తనకు పంపిన లేఖలను పోస్ట్ చేస్తూ.. ఊహించని ఓటమి ఎదురైనా తన వెంట నడుస్తూ అండగా ఉన్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఉదయం ఐర్లాండ్‌లో ఉన్న ఒక తెలుగు కార్మికుడి లేఖపై ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా మరో లేఖ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. జనసైనికుల లేఖలు చూసి పవన్ భావోద్వేగం
Pawan Kalyan

అభిమానులు, జనసైనికులు రాసిన కొన్ని లేఖలు తన మనసును కదిలించాయంటూ ట్విట్టర్ ద్వారా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వారు తనకు పంపిన లేఖలను పోస్ట్ చేస్తూ.. ఊహించని ఓటమి ఎదురైనా తన వెంట నడుస్తూ అండగా ఉన్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఉదయం ఐర్లాండ్‌లో ఉన్న ఒక తెలుగు కార్మికుడి లేఖపై ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. తాజాగా మరో లేఖ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఐర్లాండ్ కార్మికుడి లేఖకు స్పందిస్తూ.. ‘‘ఐర్లాండ్ దేశంలో ‘ఓడ కళాసీ’ గా పనిచేస్తున్న నా ప్రియమైన జనసైనికుడికి.. నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు’’ అంటూ బదులిచ్చారు. మరో లేఖకు స్పందిస్తూ.. ‘‘ఈ లేఖ 2019 ఎన్నికలలో నా ఓటమి తర్వాత వ్రాయబడింది. కష్ట సమయాల్లో నాకు నిబద్ధత కలిగిన జనసైనికుల మద్దతు లభించినందుకు సంతోషంగా ఉంది. వారి పట్టుదల చూస్తుంటే వారెంత స్ఫూర్తిదాయకంగా ఉన్నారో నాకు అర్థమవుతోంది. ఈ లేఖ రాసిన గ్రూప్ లీడర్.. ఈ లేఖతో ఆగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ‘యుఎస్’ నుండి వచ్చి, అభ్యర్థిని నిలబెట్టి, ఆచంట నియోజకవర్గం రామన్న పాలెం MPTC స్థానంలో 144 ఓట్ల మెజారిటీతో గెలుపొంది విజయం సాధించాడు. మనమందరం భౌతికంగా ఒకరికొకరం దూరంగా ఉన్నప్పటికీ, మన హృదయాలు సామాజిక న్యాయం పట్ల అదే ఉత్సాహంతో మరియు నిబద్ధతతో ఉంటాయని చాటి చెప్పారు..’’ అని చెప్పుకొచ్చారు.


ఐర్లాండ్ ‘ఓడ కళాసి’ పంపిన లేఖలో ఏముందంటే..

‘‘అన్నా,

కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ..

నా దేశాన్ని వదిలి, విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కొనే నాలాంటి వాళ్ళెందరికో ఒక్కటే నీ మీద ఆశ! ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?

సరికొత్త గెరిల్లా వార్‌ ఫెర్‌ని మొదలెట్టకపోతావా?

మనదేశాన్ని, కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చుకోకపోతామా?

17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా, దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్లందరము..

మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం

2014- నిలబడ్డాం

2019- బలపడ్డాం

2024-బలంగా కలబడదాం!

కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారుకూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతుంటే..కార్యోన్ముఖిడివై వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా, పవర్‌స్టార్‌వే కదన్నా!

Common Man Protection Forceని ప్రకటించినప్పుడే నిన్ను హీరోగా చూడటం మానేశాను. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతివైపు నడిపించే నాయకుడివి ‘ఛే!’

ఇట్లు

ఐర్లాండ్ నుంచి ఒక ఓడకళాసి’’ అని ఉంది.


మరో లేఖలో..

‘‘పవనన్నా..

అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. అందరికి ఒకటే చెప్తున్నాం. మేము అవినీతి డబ్బుతో ఓట్లు కొనలేదు. మందు పొయ్యలేదు, గూండాయిజమ్ చేయలేదు అని..

నువ్వు చేసిన దిశానిర్దేశంతో నువ్వు నిలబెట్టిన అభ్యర్థులని ప్రచారం చేశాం. నువ్వు పెట్టిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం.

వారి డబ్బు, మందు, దాదాగిరీ మీద మనం ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఇది ఇలా కొనసాగనివ్వమని మాకు తెలుసు. మా మొదటి అడుగు పడింది. ఇంకో 5 సంవత్సరాలలో ఇది 100 అడుగులకి చేరుస్తామన్న ఆత్మవిశ్వాసం మాకు ఉంది. కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందం.. మన పార్టీని ఇంకా బలపరుస్తాం.

ఈ ఓటమి కసిని నరనరాల్లో జీర్ణించుకుని 2024కి ఎగిసే కెరటమల్లే సిద్ధమవుతాం.. కోల్పోయిన దానిని తెచ్చుకునే వరకు విశ్రమించం.

గెలుపోటముల్లో నీవెంటే ఉన్నాం, ఉంటాం కూడా.. నిజాయితీని చూసి అవినీతి ఎంతో కాలం నవ్వదు. నువ్వు ఓడిపోయావ్ అన్న బాధకన్నా నిన్ను గెలిపించుకోలేకపోయాం అనే ఆవేదనని దిగమింగుకుని.. మన పార్టీకి కావాల్సినవి లైక్లు, షేర్లు కాదని తెలుసుకున్నాం..

వదిలేది లేదు అన్నా.. మమ్మల్ని నడిపించు.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్పించు.. మా జీవితంలో ఏం మారినా సరే, మేము పట్టుకున్న జెండా ఎప్పటికీ మారదు.. ‘కట్టె కాలే వరకు నీతోనే ఉంటాం’.

రెట్టించిన విశ్వాసంతో

నీ జనసైనికులు’’ అని ఉంది.

Updated Date - Jan 18 , 2024 | 01:32 PM