Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:06 PM

మహానటి సావిత్రిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం.. నా జీవితానికి దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి. దివంగత నటి, మహానటి సావిత్రిపై సంజయ్‌ కిశోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ బుక్‌ లాంచ్‌ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆ వేడుకలో సావిత్రి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు.

Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?
Megastar Chiranjeevi at Savitri Classics Book Launch Event

‘‘మహానటి సావిత్రిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకాన్ని (Savitri Classics Book) ఆవిష్కరించే అవకాశం రావడం.. నా జీవితానికి దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నాను’’ అని అన్నారు పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). దివంగత నటి, మహానటి సావిత్రిపై సంజయ్‌ కిశోర్‌ (Sanjay Kishore) రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ బుక్‌ లాంచ్‌ వేడుక (Savitri Classics Book Launch Event) మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రచయిత సంజయ్ కిశోర్, నిర్మాత అల్లు అరవింద్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, సావిత్రి కుమారుడు సతీశ్ కుమార్, మురళీ మోహన్, జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి వంటి వారంతా హాజరైన ఈ కార్యక్రమంలో సావిత్రి గురించి చిరంజీవి (Chiranjeevi About Savitri) మాట్లాడుతూ.. ఉద్వేగానికి లోనయ్యారు.

Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..


ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఆ మహానటి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆవిడ గురించి మాట్లాడేకంటే.. చేతలలో ఇలా చూపించుకునే అదృష్టం లభించినందుకు, ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ మహానటితో నాకు కూడా అనుబంధం ఉందని చెప్పుకోవడానికి సంతోషంగానూ, గర్వంగానూ అనిపిస్తుంది. నా యాక్టింగ్ కోర్స్ పూర్తి కాకుండానే ‘పునాదిరాళ్లు’ (Punadhirallu) సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఉండే ఐదుగురు మెయిన్ నటీనటులలో నువ్వు ఒకరివి అని చెప్పారు. సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లేటప్పుడు.. నువ్వు ఎవ్వరితో యాక్ట్ చేస్తున్నావో తెలుసా? మహానటి సావిత్రిగారితో అని చెప్పారు. అంతే నాకు ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. ఆ తర్వాత నన్ను రాజమండ్రిలోని పంచవటి హోటల్‌లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు తీసుకెళ్లారు. అక్కడ ఆవిడను చూడగానే నాకు మాట రాలేదు. ఈ మహానటినేనా.. ఇన్నాళ్లు నేను, మానాన్న ఆరాధించేవాళ్లమని అనుకుంటూ.. అలా చూస్తుండి పోయాను. (Megastar Chiranjeevi Talks about Mahanati Savitri)


Savitri-daughter.jpg

అప్పుడామె.. ‘నీ పేరేంటి బాబు’? అని అడిగారు. నాకు మాటలు రాక తడుముకుంటున్నాను. ఎందుకంటే, శివశంకర వరప్రసాద్ (Sivs Sankara Vara Prasad) అనే పేరును మార్చుకుని అప్పటికి ఒక్కరోజు మాత్రమే అవుతుంది. ఎక్కడో.. ‘చిరంజీవి’ అని చెప్పాను. ఆమె ‘శుభం’ అన్నారు. ఇక రేపో మాపో షూటింగ్ అనగ.. భారీగా వర్షం పడింది. ఆ సినిమాలో చేయాల్సిన ఆర్టిస్ట్‌లందరూ ఒకచోట కూర్చుని ఉన్నారు. పంచలోకి జల్లు పడుతుంది. అక్కడున్న ఆర్టిస్ట్‌లకు ఏం తోచక.. ఏయ్ చిరంజీవి (Chiranjeevi) డ్యాన్స్ చేయవయ్యా? అన్నారు. అప్పటికే నా దగ్గర టేపు రికార్డర్ ఉంది. కొన్ని ఇంగ్లీష్ మ్యూజిక్ బిట్స్ ఉన్నాయి. వాళ్లు అడగడమే ఆలస్యం డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశా. అయితే అక్కడ నేల తడిచి ఉండటంతో.. నేను జారిపడ్డాను. అయినా కూడా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేస్తుండటంతో అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ మహానటి కూడా సంతోషించి.. నాకు చాలా నచ్చవయ్యా.. అంటూ నన్ను దగ్గరకు తీసుకుని.. ‘భవిష్యత్‌లో మంచి యాక్టర్‌వి అవుతావు’ అన్నమాట.. నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్లు అనిపించింది.

Megastar.jpg

ఆ తర్వాత చాలా కాలం తర్వాత మళ్లీ ఆమెతో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘ప్రేమ తరంగాలు’ (Prema Tarangalu). అందులో నేను, కృష్ణంరాజు (Krishnam Raju)గారు, సుజాత (Sujatha)గారు, జయసుధ (Jayasudha)గారు.. మేమంతా ఉన్నాం. సావిత్రిగారిది మా అమ్మ పాత్ర. ఆ తల్లికి బిడ్డగా నటించే అవకాశం నాకు కలిగింది. ఆ తర్వాత మళ్లీ ఆమెతో కలిసి నటించే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆమె మనకు దూరమయ్యారు. కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడూ చూస్తుంటాను. ఆవిడ పాటలే వింటుంటాను. ఏదైనా పాత పాటలు చూడాలనిపిస్తే మాత్రం.. ఆ మహానటి పాటలే చూస్తుంటాను. కేవలం కళ్లతోనే నటించగల గొప్పనటి. ఇలా కళ్లతోనే హావభావాలు పలికించగల నటి ప్రపంచంలో ఇంకెవరూ లేరు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రిగారు. నాన్నగారి నుంచే నేను కూడా ఆమెను అభిమానించడం మొదలైంది. అలాంటి నటి గురించి వర్ణించేంత అర్హత నిజంగా నాకు లేదు. కానీ ఆవిడని ఎప్పుడూ నా మనసులో ఆరాధిస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి అవకాశం రావడం.. ఇది నా జీవితానికి దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

***************************

Updated Date - Apr 03 , 2024 | 12:06 PM