Allu Arjun: సొంతగూటికి అల్లు అర్జున్ మామ.. ఐకాన్ స్టార్ రంగంలోకి దిగుతారా?
ABN , Publish Date - Feb 16 , 2024 | 06:19 PM
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అల్లు అర్జున్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు చెప్పబోయే వార్త విషయంలో.. ఆయనకు డైరెక్టుగా సంబంధం లేకున్నా ఇండైరెక్టుగా ఆయన చుట్టే చక్కర్లు కొడుతుంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అల్లు అర్జున్ (Allu Arjun) పేరు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు చెప్పబోయే వార్త విషయంలో.. ఆయనకు డైరెక్టుగా సంబంధం లేకున్నా ఇండైరెక్టుగా ఆయన చుట్టే చక్కర్లు కొడుతుంది. అసలు విషయమేమిటంటే.. అల్లు అర్జున్ భార్య స్నేహ తండ్రి స్వయానా పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrashekar Reddy) ఈ రోజు BRS పార్టీని వీడి కాంగ్రెస్ (Congress)లో చేరడమే.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం చింతపల్లి. వ్యాపారం రిత్యా హైదరాబాద్‌లో సెటిలైనప్పటికీ ఓ ఫౌండేషన్ ద్వారా తమ సొంత మండలంలో గత పదిహేను సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి TRS పార్టీలో చేరిన ఆయన ఇబ్రహీం పట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2018, 2023లలో తన సొంత నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించినా అక్కడ సిట్టింగుకే సీటు కేటాయించడంతో రాజకీయాలకు విరామం ప్రకటించి BRS పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) విజయం సాధించి అధికారంలోకి రాగా పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (Kancharla Chandrashekar Reddy).. ఈ రోజు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో కలిసి BRSను వీడి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి దీప్‌దాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారంతా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
అయితే చంద్ర శేఖర్ రెడ్డికి మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దేశంలోనే మల్కాజిగిరి నియోజకవర్గం అతి పెద్దది కావడమే కాక ఎక్కువగా సెటిలర్లు నివాసముండే ప్రాంతంగా పేరుంది. ఇక్కడి నుంచి చంద్ర శేఖర్ రెడ్డి (Kancharla Chandrashekar Reddy) పోటీ చేసే క్రమంలో అల్లు అర్జున్ (Allu Arjun) తప్పని సరిగా ప్రచారంలో పాల్గొంటాడని.. అది చంద్ర శేఖర్ రెడ్డి గెలుపుతో పాటు, పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.