వేణు స్వామి చెంతకు మరో ముద్దుగుమ్మ!
ABN , Publish Date - Feb 09 , 2024 | 07:32 PM
ఇప్పటివరకు కథానాయికలు రష్మిక, డింపుల్ హయతి, నిధి అగర్వాల్ వేణు స్వామి వద్ద పూజలు నిర్వహించగా తాజాగా ఆ లిస్టులోకి బుల్లి తెర బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నా.. జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య అదే స్థాయిలో పెరుగుతూ ఉండటం విశేషం. చాలా చోట్ల అనేక మంది కుక్క తోక వంకర అన్న చందంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగునాట ఈ సంస్కృతి రోజురోజుకు పెరుగుతుంది. అందుకు ముఖ్య ఉదాహరణ మన నిత్యం ఆరాధించే సినీ తారలే. సామాన్యులతో పాటు వారు జ్యోతిష్యాన్ని తెగ నమ్మేస్తున్నారు.
ప్రధానంగా వేణుస్వామి (Venu Swamy) జ్యోతిష్యం అంటే పడి చస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీ జ్యోతిష్యుడు అని పేరు తెచ్చుకున్న వేణు స్వామి (Venu Swamy).. చాలామంది సినీ తారల ఇండ్లలోనే కాకుండా ఫేజ్1 కల్చర్ సర్కిల్ ఇళ్లల్లోనూ పూజలు, యాగాలు నిర్వహిస్తుంటారు.
ఈ క్రమంలోనే కథానాయికలు రష్మిక మొదలు డింపుల్ హయతి, నిధి అగర్వాల్ వంటి వారు వేణు స్వామి వద్ద పూజలు నిర్వహించగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా బుల్లితెర బ్యూటీ జూనియర్ సమంతగా పేరున్న అషు రెడ్డి (Ashu Reddy) కూడా ఈ లిస్టులో చేరింది.
తాజాగా ఆమె వేణు స్వామితో తన ఇంట్లో బగ్లాముఖిదేవి, రాజ శ్యామలా దేవీ పూజలు చేయించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. అయితే పూజల అనంతరం వారికి అదృష్టం కలిసొచ్చిందా, సినిమా ఛాన్స్‌లు వచ్చాయా,పెరిగాయా అనేది తెలియదు గానీ వేణు స్వామి (Venu Swamy) కి మాత్రం ఫ్రీ పబ్లిసిటీ వచ్చి సెలబ్రిటీలను మించి బిజీ అయిపోయారనేది వాస్తవం.