Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?
ABN , Publish Date - Oct 10 , 2024 | 04:15 PM
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠల ‘విశ్వంభర’ వాయిదా పడనుందా? ఆ ప్లేస్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రానుందా? సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ వస్తే.. మరో సినిమా కచ్చితంగా వాయిదా పడాల్సి ఉంటుంది. ఆ సినిమా ఏది? అసలు ‘విశ్వంభర’ వాయిదాకు కారణం ఏమిటి? అనే విషయాలలోకి వస్తే..
2025 సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠల ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ‘విశ్వంభర’ స్లాట్‌ని మెగాస్టార్, తన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఇవ్వబోతున్నట్లుగా టాక్ మొదలైంది. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల ఉంటుందనేలా మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. అయితే డిసెంబర్ అని చెప్పారు కానీ.. డేట్ విషయంలో మాత్రం మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ చిత్రం ‘విశ్వంభర’ స్లాట్ తీసుకుని సంక్రాంతి బరికి దిగే అవకాశం అయితే లేకపోలేదు. అదే నిజమైతే అప్పుడు మరో సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అదేంటంటే..
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
‘విశ్వంభర’ వాయిదాకు కారణాలివే
ముందుగా ‘విశ్వంభర’ వాయిదాకు గల కారణాలలోకి వెళితే.. చిత్ర అనౌన్స్‌మెంట్ రోజే రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ‘విశ్వంభర’ చిత్రం మెగాస్టార్‌కు మరో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహా చిత్రమవుతుందనేలా మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. అందుకే మేకర్స్ ఏ చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదట. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడటానికి కారణం CG వర్క్ అని తెలుస్తోంది. CG వర్క్‌కు సంబంధించి సుమారు 3 నుంచి 6 నెలల వరకు సమయం పడుతుందనేలా టాక్ వినబడుతోంది. భారీ బడ్జెట్‌ను మేకర్స్ ఈ CG వర్క్‌కు కేటాయించారని, ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఈ చిత్రంలో క్రియేట్ చేస్తున్నారనేలా ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. CG విభాగం వారు ఎక్కువ సమయం అడగడంతో.. సినిమాను వాయిదా వేయక తప్పడం లేదనేలా టాక్ నడుస్తోంది.
Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే
సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ వస్తే సమస్య ఏమిటంటే..
‘విశ్వంభర’ స్లాట్‌లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రావడం దాదాపు కన్ఫర్మ్ అనేలా వార్తలు వినబడుతోన్న తరుణంలో.. నిజంగా ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి బరిలో దిగితే.. మరో చిత్రం వాయిదా పడక తప్పదు. ఆ సినిమా మరేదో కాదు.. వెంకీ, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం. నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు ఉన్న సంక్రాంతి సెంటిమెంట్ ప్రకారం.. రాబోయే సంక్రాంతికి ప్రస్తుతం వెంకీతో చేస్తున్న సినిమా రిలీజ్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. ఒకే నిర్మాతకి చెందిన రెండు సినిమాలు సంక్రాంతి సీజన్‌లో విడుదలవడం అనేది సాధ్యంకాని విషయం. ఎందుకంటే, సంక్రాంతి టైమ్‌లో థియేటర్ల కోసం ఎటువంటి రచ్చలు జరుగుతున్నాయో.. గత కొన్ని సంక్రాంతి సీజన్‌ల నుండి చూస్తూనే ఉన్నాం. అలాంటి రచ్చ జరిగినప్పుడల్లా.. దిల్ రాజే ముందుండి సమస్యను పరిష్కరిస్తూ.. అన్ని సినిమాలకు న్యాయం జరిగేలా చూస్తుంటారు. మరిప్పుడు ఆయన సినిమాలతోనే సమస్య వస్తే.. ఎలా పరిష్కరిస్తారు? తన సినిమాతో తనే పోటీ పడటానికి దిల్ రాజు అస్సలు ఒప్పుకోరు. అలాంటప్పుడు తన సెంటిమెంట్ పక్కన పెట్టకుండా.. ఈ రెండు సినిమాలలో ఒక సినిమాని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా సంక్రాంతి బరిలో ఉంటుంది?
Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
వెంకీ త్యాగం చేయాల్సిందే..
డిసెంబర్‌లో ‘గేమ్ చేంజర్’ వస్తే.. వెంకీ (Victory Venkatesh) సినిమాకు ఏ ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ సంక్రాంతి (Sankranthi)కి స్లాట్ దొరకడం అంటే ఇప్పుడున్న కాంపిటేషన్‌లో మాములు విషయం కాదు. అది ఒక కమర్షియల్ సినిమాకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్‌ని దిల్ రాజు అస్సలు వదులుకోరు. అందునా ‘గేమ్ చేంజర్’ కోసం ఆయన ఎంతో ఖర్చు పెట్టారు కాబట్టి.. అలాగే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఆ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేస్తే ఫ్యాన్స్ గరం గరం అవుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం వెంకీతో చేస్తున్న చిత్రాన్ని వాయిదా వేసి.. కచ్చితంగా దిల్ రాజు ‘గేమ్ చేంజర్’నే సంక్రాంతి బరిలో దించుతారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..