Unstoppable 4: బాలయ్య ముందు వెంకీ భావోద్వేగం.. ఎందుకంటే..
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:07 AM
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ ఏడో ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేశ్, ఆయన సోదరుడు డి.సురేశ్ బాబు(D Suresh Babu), 'సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
‘‘నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. విదేశాల్లో చదువుకోవాలి. అక్కడే స్థిరపడాలని కోరిక ఉండేది. 1986లో ఇండియాకి తిరిగొచ్చాక ఏదైనా బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నా. కానీ, కుదర్లేదు. అనుకోకుండా ‘కలియుగ పాండవులు'తో నటుడిగా మారాను. అప్పటికే నువ్వు (బాలకృష్ణ), చిరంజీవి, నాగార్జున హీరోలుగా ఇండస్ట్రీ లో ఉన్నారు. అప్పటి ఇప్పటికా ఆ జర్నీ కొనసాగుతూనే ఉంది’’ అని వెంకటేశ్ (Venkatesh) అన్నారు. నందమూరి బాలకృష్ణ (NBK) వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable 4), ఏడో ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేశ్, ఆయన సోదరుడు డి.సురేశ్ బాబు(D Suresh Babu), 'సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki vastunnaM) చిత్ర బృందం అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ ఆడిగిన ప్రశ్నలకు వెంకటేశ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. చదువుకునే రోజుల్లో తాను రెబల్ అంటూ, అనేక మందితో గొడవ పడడం, ఎవరో వచ్చి ఆపడం.. ఇలా చాలా జరిగాయి’’ అని చెప్పి వెంకటేశ్ నవ్వులు పూయించారు. తన తండ్రి రామానాయుడును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు వెంకీ. ‘‘ఆయన తనయుడిని అయినందుకు గర్వపడుతున్నా. ఈ రోజు మేం ఇలా ఉన్నామంటే ఆయనే కారణం. ఆయన లైఫ్‌ను సినిమాకే అంకితం చేశారు. కుటుంబంతోనూ సమయాన్ని గడిపేవారు. నేనూ అదే ఫాలో అవుతున్నా’’ అని అన్నారు.
అలాగే కుటుంబంలో ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు వెంకటేశ్.
అన్నయ్య సురేశ్‌బాబు: మా కుటుంబానికి మూలస్తంభం. అన్ని విషయాల్లో నాకు నచ్చుతాడు. ఏదైనా నిర్ణయానికి చాలా సమయం తీసుకుంటాడు. నా సినిమా కథలన్నీ ముందు ఆయనే వింటాడు.
రానా: చిన్నప్పుడు సైలెంట్‌గా ఉండేవాడు. బెడ్ కిందకు వెళ్లి సూపర్‌హీరో పాత్రల బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు నటనే కాదు నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ.. ఇలా అన్నింటిలోనూ రాణిస్తున్నాడు.
మేనల్లుడు నాగచైతన్య: చిన్నతనంలో బొద్దుగా ఉండేవాడు. వాడిని హగ్ చేసుకోవడం ప్రత్యేకంగా ఉండేది. ఏదో తెలియని ఆనందం ఉంటుంది. మా అందరి ఫేవరెట్‌వాడు. మేమిద్దరం కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమా మంచి జ్ఞాపకాలు పంచింది. అప్పటి నుంచి అందరూ నన్ను వెంకీ మామ అని పిలుస్తున్నారు.
కుమార్తెలు: ఇద్దరికీ వివాహమైంది. పిల్లలు వాళ్ల అమ్మకంటే నాతోనే ఫ్రీగా ఉంటారు. వారి కెరీర్‌లో విషయంలో నా గైడెన్స్ తక్కువే. ఎవరికి ఏది నచ్చితే అది చేయమని చెబుతా. వీరే కాదు రానా, చైతన్య.. ఇలా మొత్తం నాకు 8 మంది పిల్లలు. అందరిని సమానంగానే చూస్తా.
కుమారుడు: అర్జున్‌కి 20 ఏళ్లు. అమెరికాలో చదువుతున్నాడు. తనకంటూ డ్రీమ్స్ ఉన్నాయి. ఇండస్ర్టీలోకి ఎప్పుడొస్తాడనేది వేచి చూద్దాం.
భార్య (నీరజ): తనను నేను అంగికరించా. తను నన్ను అంగీకరించింది. ఆమె కోసం అప్పుడప్పుడు వంట చేస్తుంటా. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.
‘పెద్దన్నయ్య’ స్పెషల్: బాలకృష్ణ
సంక్రాంతి కానుకగా విడుదలై (1997) విజయాన్ని అందుకున్న పెద్దన్నయ్య సినిమా గురించి చెప్పమని అడగ్గా బాలకృష్ణ అప్పటి సంగతులు చెప్పుకొచ్చారు. ‘‘ఎన్టీఆర్ స్థ్థాపించిన రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన సినిమా ‘పెద్దన్నయ్య’. నాన్న మరణించిన తర్వాత నటించిన తొలి చిత్రమది. సోదరులు మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా, రామకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఘన విజయమే.. ఆయనకు ఘన నివాళి అని పట్టుదలతో తీశాం. అందుకే మా కుటుంబానికి ఆ సినిమా ఎంతో ప్రత్యేకం’’ అని బాలయ్య చెప్పారు.