Trivikram Srinivas: మహేష్.. నాకు నిన్న మొన్న పరిచయమైన హీరోలాగే కనిపిస్తున్నారు
ABN , Publish Date - Jan 10 , 2024 | 11:24 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు.. నేను ‘అతడు’ సినిమాకి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో, ‘ఖలేజా’కి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈరోజు కూడా ఆయన అలాగే ఉన్నారని అన్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా 3వసారి తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం గుంటూరులో నిర్వహించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ‘అతడు, ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. (Guntur Kaaram Pre Release Event)
ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas Speech) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా పేరు ‘గుంటూరు కారం’. రమణగాడు (Ramana Gaadu) మీ వాడు, మనందరి వాడు. అందుకని మీ అందరి మధ్యలో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాం. చాలారోజుల షూటింగ్ తర్వాత విపరీతంగా అలిసిపోయి కూడా మీ అందరినీ కలవడం కోసం గుంటూరుకి వచ్చారు. రెండో కారణం.. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప మహానటుడు, ఒక గొప్ప మనిషితో నేను సినిమా చేయలేదు కానీ, ఆయన నటించిన ఒక సినిమాకి పోసానిగారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పనిచేశాను. ఆయనతో డైరెక్ట్‌గా పరిచయం కలిగినటువంటి సందర్భం అదొక్కటి మాత్రమే. ఆ తర్వాత నేను ‘అతడు, ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడటం, ఆయనతో గడిపిన ప్రతిక్షణం కూడా నాకు చాలా చాలా అపూర్వమైనది, అమూల్యమైనది. అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్‌గారు ఇంకెంత అదృష్టవంతుడు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
ఒక్క సినిమాకి వంద శాతం పని చేయాలంటే.. రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా వెనక్కి తిరిగి చూడరు. నేను ‘అతడు’ (Athadu) సినిమాకి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో, ‘ఖలేజా’ (Khaleja)కి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈరోజు కూడా ఆయన అలాగే ఉన్నారు. పాతిక సంవత్సరాలైంది అంటున్నారు కానీ, నాకు మాత్రం నిన్న మొన్న పరిచయమైన హీరోలాగే కనిపిస్తున్నారు. చూడటానికి అంత యంగ్‌గా ఉన్నారు. మనసులోనూ అంతే యంగ్‌గా ఉన్నారు. పర్ఫామెన్స్‌లో కూడా అంతే నూతనంగా, అంతే యవ్వనంగానే ఉన్నారు. ఆయనకు మరిన్ని వసంతాలు ఉండాలని, కృష్ణగారి తరపున మీరందరూ ఆయన వెనక ఉండాలని, ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12న థియేటర్లలో కలుద్దాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం. ఆనందంగా జరుపుకుందాం. రమణగాడితో కలిసి జరుపుకుందాం..’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*నన్ను క్షమించు స్వామీ... కెప్టెన్ సమాధి వద్ద హీరో విశాల్ భావోద్వేగం
***************************
*Guntur Kaaram: ‘మావ ఎంతైనా’.. లిరికల్ సాంగ్
***************************
*Vijay Sethupathi: హిందీ నేర్చుకోవద్దని ఎవరూ చెప్పలేదు
*******************************
*Dil Raju: మహేష్ బాబు కలెక్షన్ల తాట తీయబోతున్నాడు..
****************************