Tollywood: చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:16 PM

ఈ ఏడాది టాలీవుడ్‌లో బడా హీరోలకి అసలు కలిసిరాలేదు. చెప్పింది ఒకటైతే చేసింది మరొకటి. ఇక యంగ్ హీరో సాయిదుర్గా తేజ్ కూడా సీనియర్‌ల బాటలోనే నడవటం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం.

టాలీవుడ్ స్టార్ హీరోలు వాళ్లు... వాళ్ల సినిమా వస్తోంది అంటే బాక్సాఫీస్ వద్ద జాతరే. కానీ ఈ ఏడాది వాళ్ల జాతర మిస్ అయింది. అభిమానులు ఆశపడ్డా... వాళ్లు మాత్రం నిరాశపరిచారు. ఎవరా హీరోలు ఏమా కథ.. తెలియాలంటే టాలీవుడ్ టాక్ లో చూడాల్సిందే.


నిరాశపరిచిన హీరోలు

పాన్ ఇండియా ట్రెండ్ మొద‌ల‌య్యాక స్టార్ హీరోలు ప్ర‌తి ఏడూ బిగ్ స్క్రీన్‌పై క‌నిపించ‌డం గ‌గ‌న‌మైపోయింది. ఎవ‌రిని చూసినా మినిమం రెండు, మూడేళ్లు మొహం చాటేస్తున్నారు. వేదిక‌ల‌పై మాట్లాడిన‌ప్పుడు కుదిరితే ఏడాది రెండు, మూడు సినిమాలు చేస్తామ‌ని చెప్పిన వాళ్లు కాస్తా.. చేత‌ల‌కొచ్చేస‌రికి క‌నీసం ఒక‌టి కూడా కంప్లీట్ చేయ‌లేక‌పోతున్నారు. అలా ఈ ఏడాది పెద్ద హీరోలే బిగ్ స్క్రీన్ పై కనిపించ‌లేదు. ముఖ్యంగా మెగాస్టార్, నంద‌మూరి బాల‌య్య‌, ప‌వ‌ర్ స్టార్, యంగ్ హీరో సాయిదుర్గ తేజ్.. అలాగే మ‌రికొంత మంది నుంచి ఏ సంద‌డి క‌నిపించ‌లేదు.


మాటంటే మాటే అన్నారు.. చెప్పామంటే చేసి తీరుతామని ప్రతిజ్ఞలు చేశారు. అదుగో.. ఇదుగో అంటూ ఎన్నో ఆశలు పెట్టారు. తీరా సమయానికి చావు కబురు చల్లగా చెప్పారు. ఈ సంవత్సరాన్ని సున్నాతో ముగించారు.

చిరుబాటలో మెగామేనల్లుడు

రీఎంట్రీలో స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. కుర్ర హీరోలే కుళ్లుకునేలా దూసుకెళ్లారు. క‌ట్ చేస్తే ఇప్పుడు రేసులో వెనుక‌బ‌డ్డారు. బోలాశంకర్ తర్వాత విశ్వంభర సినిమాను మొదలు పెట్టాడు.. 2024లో వ‌స్తుంద‌నుకున్న సినిమాను చివ‌రికి పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది చిరు వెండితెరపై క‌నిపించ‌లేదు. ఇటు మెగా మేనల్లుడు సాయిదుర్గ్ తేజ్ పరిస్థితి అలానే ఉంది. విరూపాక్ష తర్వాత మ‌ళ్లీ మెర‌వలేదు.


బాలయ్య, చరణ్ మధ్య పోటీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మొదట డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని టాక్ నడిచినప్పటికి... వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. దీంతో తాను కూడా ఈ ఏడాది అభిమానుల‌ను అల‌రించ‌లేక‌పోయాడు. ఇక‌ బాలయ్య నటించిన డాకు మహారాజ్ కూడా డిసెంబర్ ను టార్గెట్ చేసింది. కానీ చివ‌రికి సంక్రాంతి రేస్ లో నిలిచింది. అటు ప‌వ‌న్ కూడా ఎన్నిక‌ల కార‌ణంగా బ్రేక్ తీసుకుని.. ఇంకా చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌లేక‌పోతున్నాడు. కాస్త దృష్టిపెడితే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యే చాన్సు ఉన్నా.. ఆయ‌న అస‌లు ఆ వైపున‌కే చూడటం మానేశాడు. ఇలా పెద్ద హీరోలే ఈ ఏడాది అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచారు.

Updated Date - Dec 07 , 2024 | 12:59 PM