Tharun Bhascker: ఎస్‌పీబీ పాట రీ క్రియేషన్ ... తరుణ్‌భాస్కర్ స్పందన!
ABN , Publish Date - Mar 18 , 2024 | 01:42 PM
‘కీడా కోలా’ చిత్రంలో తమ అనుమతి లేకుండా ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పాటను రీక్రియేట్ చేయడంపై ఆయన తనయుడు ఎస్‌పి. చరణ్ సినిమా టీమ్‌పై న్యాయపరమైన చర్యలకు దిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
‘కీడా కోలా’ చిత్రంలో తమ అనుమతి లేకుండా ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పాటను రీక్రియేట్ చేయడంపై ఆయన తనయుడు ఎస్‌పి. చరణ్ సినిమా టీమ్‌పై న్యాయపరమైన చర్యలకు దిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తరుణ్ భాస్కర్ ఈ వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చారు. ‘కీడాకోలా’లో ఏఐ టెక్నాలజీ ద్వారా ఎస్పీ బాలు వాయిస్ వాడటంపై ఆయన కుమారుడు చరణ్ మీకు లీగల్ నోటీసులు పంపించారని వార్తలు వచ్చాయి. నిజమేనా?’’ అని జర్నలిస్ట్ ప్రశ్నించగా, ‘‘ఇద్దరి వైపు నుంచి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. మనకున్న గొప్ప కళాకారులను గౌరవిస్తూ ప్రేక్షకులను అలరించే విధంగా ఏదైనా వినూత్నంగా చేయాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. అమర్యాద పరచాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదు. అగ్ర నటీనటులతో కమర్షియల్ చిత్రాలు చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలాంటి మనస్తత్వం లేదు. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాం. ఏఐకూ కొన్ని పరిమితులున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో చాలా ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయి. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని గౌరవిస్తూ కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి. ఈ క్రమంలోనే కమ్యూనికేషన్ గ్యాప్ తలెత్తి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడంతా సర్దుకుంది. సమస్యను పరిష్కరించాం’’ అని తరుణ్ భాస్కర్ చెప్పారు.
చైతన్యరావు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ తెరకెక్కించారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా మంచి టాక్ సొంతం చేసుకుంది. క్రేౖమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలోని ఓ సన్నివేశంలో ఏ.ఐ. సాయంతో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రాన్ని రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు నుంచి అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం నేరమని, తరుణ్ భాస్కర్ మూవీ టీమ్‌కు లీగల్ నోటీసుల పంపించినట్లు వార్తలొచ్చాయి.