Tollywood: హద్దులు చెరిపేసిన తెలుగు సినిమా
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:11 PM
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే. కానీ ఇవాళ తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. మన హీరోలంతా పాన్ ఇండియా కథానాయకులు అవుతున్నారు. ఈ రోజు తెలుగు సినిమా.. అన్ని సినిమా ఇండస్ట్రీలకు దారి చూపుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా హద్దులు చెరిపేసింది. అదెలాగో ఈ స్టోరీలో..
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే. కానీ ఇవాళ తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. మన హీరోలంతా పాన్ ఇండియా కథానాయకులు అవుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’ వంటి సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఈ చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు కొండంత విశ్వాసాన్ని ఇచ్చాయి. ఆ స్ఫూర్తితోనే తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. ద్వితీయ శ్రేణి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలకే సై అంటున్నారు. ప్రాంతీయ భాషల్లో ఆకట్టుకున్న మూవీస్ కూడా పాన్ ఇండియా సినిమాలుగా రూపాంతరం చెందుతున్నాయి. కాన్సెఫ్ట్ బాగుంది, ఫ్యాన్స్ ఆదరిస్తారన్న నమ్మకం కుదిరితే చాలు.. మన సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సరైన కంటెంట్, చక్కటి విజువలైజేషన్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్.. ఇవి ఉంటే చాలు.. సినిమాకు భాష, ప్రాంతీయ సరిహద్దులు అడ్డురావని మన తెలుగు సినిమాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోయే సినిమాల కోసం దేశం అంతా ఎదురుచూస్తోంది.
ఇప్పుడు దేశంలో ఏ భాష మాట్లాడే వారైనా తెలుగు సినిమాలు అంటే తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్‌తో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పోయింది. దాంతో ఏ భాషలో లేని విధంగా తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు సాధించారు. వీరు నటిస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. వీరితోపాటు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, రాజమౌళి సినిమాతో మహేశ్ బాబు పాన్ ఇండియా కేటగిరీలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ‘వార్-2’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
సౌత్ నార్త్ అనే తేడా లేదు
సాధారణంగా మన పెద్ద హీరోలు నటించిన చిత్రాలు కర్ణాటకలో, తమిళనాట విడుదలవుతుంటాయి. కానీ, రాజమౌళి ‘బహుబలి’ సిరీస్ సినిమాలతో సౌత్, నార్త్ అనే హద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడు సౌత్‌తోపాటు నార్త్ ఇండియాలోనూ మన సినిమాల పట్ల తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బిహార్‌తోపాటు బెంగాల్‌లోనూ విడుదలవుతున్నాయి. కొవిడ్ అనంతరం ఈ ట్రెండ్ తారా స్థాయికి చేరుకుంది. 2022లో తెలుగు నుంచి అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కాగా... ఒకటి, రెండు మినహా మిగతావన్నీ ఘన విజయం సాధించాయి. వీటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్, మేజర్, కార్తికేయ2, సీతారామం’ చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. 2023లో కూడా నార్త్ ఇండియాలో బాలీవుడ్ కంటే సౌత్ ఇండియన్ సినిమాలే ఎక్కువగా విజయవంతమయ్యాయి. అందులోనూ టాలీవుడ్ చిత్రాల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2024లోనూ ఇండియన్ బాక్సాఫీస్‌ని తెలుగు సినిమా శాసించిందనే చెప్పాలి.
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ రూ.1200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్‌లో రూ.250 కోట్లకు పైగా రాబట్టి, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక్కడ అతిపెద్ద ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో 2024 సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం కళ్లు చెదిరే కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుని, సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం వెయిట్ చేసేలా చేసింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదలైంది. కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.3 కోట్లు, కేరళలో కోటి రూపాయలు వసూలు చేస్తే.. ఒక్క హిందీ వర్షన్‌కే రూ. 24 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మూవీ డిసెంబరు 5న విడుదల అవుతోంది. సౌత్ ఇండియా విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే నార్త్ ఇండియాతోపాటు పశ్చిమ బెంగాల్‌లో కూడా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికే రూ. 450 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ‘క’. దీపావళి సందర్భంగా భారీ కాంపిటీషన్‌లో విడులైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్.
Also Read- Allu Arjun: అల్లు అర్జున్‌ని మార్చేసిన వెపన్ ఏంటో తెలుసా..
రాబోతున్న పాన్ ఇండియా చిత్రాలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలసి నటించిన మల్టీస్టారర్ ‘కుబేర’ విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబరులో ఈ చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం.
నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ బేనర్‌పై నిర్మించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదలవుతోంది.
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి రానుంది.
ఇతర భాషల వారికీ అవకాశం
పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణే, జాన్వీకపూర్, కియరా అద్వానీ తదితరులు ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తెరకెక్కుతున్న సినిమాల్లో బాలీవుడ్‌తో పాటు వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులకు అవకాశాలు దక్కుతున్నాయి. కొంతమంది బాలీవుడ్‌లో కంటే తెలుగు మూవీస్‌లో బాగా రాణిస్తున్నారు. వరుసగా అవకాశాలు వస్తుండటంతో ఇక్కడే బిజీ అయిపోతున్నారు. త్వరలో రాబోతున్న ‘పుష్ప-2, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళీ, కన్నడ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు.