TG High Court: మోహన్ బాబుకి ఆ అవసరం లేదు..
ABN , Publish Date - Dec 11 , 2024 | 03:51 PM
తెలంగాణ హైకోర్టు మంచు మోహన్ బాబుకి భారీ ఊరటనిచ్చింది.
మంచు ఫ్యామిలీలో గత మూడు రోజులుగా జరుగుతున్న వివాదంపై రాచకొండ సీపీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మంగళవారం రాత్రి వారి ఫ్యామిలీలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ లు విచారణకు హాజరు కావాలని సీపీ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విచారణకు మంచు మనోజ్ హాజరు అయ్యారు. కాగా, తెలంగాణ హై కోర్టు మోహన్ బాబుకి భారీ ఊరటనిచ్చింది. ఇంతకీ ఏమైందంటే..
సినీ నటుడు మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై నమోదైన కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు జారీచేశారు. పోలీసుల నోటీసులపై మోహన్‌బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే కుటుంబంలో తలెత్తిన వివాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మోహన్‌బాబుకు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన వైద్యులు.. "మోహన్ బాబు హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. బీపీ పెరిగింది. అతనికి ప్రస్తుతం మెడలో నొప్పి విపరీతంగా ఉంది. మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నారు. ఫేస్ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బీపీ 200 పైన ఉంది.. ఇవ్వాళ కూడా ఇంకా బీపీ ఉంది. హార్ట్ సైడ్ అంతా బాగానే ఉంది. రాత్రంతా బాధ వల్ల నిద్ర లేదు. గతంలో జరిగిన కొన్ని సర్జరీలతో ఆయన వేరే మెడిసిన్ వాడుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్యం అన్‌స్టెబుల్‌గానే ఉంది. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి. సీటీ స్కాన్ తీశాము. డిశ్చార్జ్‌కి ఇంకా రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. ఆయన మానసికంగా కోలుకోవడానికి సమయం పడుతుంది" అని తెలిపారు.