Tammareddy Bharadwaja: చిరంజీవి కుటుంబం నుంచి ఎందుకు వెళ్లలేదో...

ABN , Publish Date - Dec 28 , 2024 | 02:36 PM

సీఎంతో జరిగిన మీటింగ్‌కు చిరంజీవి కుటుంబం నుంచి ఎవరూ ఎందుకు వెళ్లలేదో నాకు తెలియదు. బహుశా వారికి ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయేమో’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు

‘‘చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ రావడానికి 40 ఏళ్లు పట్టింది. ఇక్కడి నుంచి మరో చోటకు వెళాలన్నా అంత సమయమే పడుతుంది. సీఎంతో జరిగిన మీటింగ్‌కు చిరంజీవి కుటుంబం నుంచి ఎవరూ ఎందుకు వెళ్లలేదో నాకు తెలియదు. బహుశా వారికి ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయేమో’’ అని తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) అన్నారు. కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సినీ ప్రముఖులు సీఎంను (Meeting with CM) కలవడం గురించి మాట్లాడారు. ‘‘పరిశ్రమలో అందరినీ సమన్వయపరచడానికే ఫిల్మ్‌ ఛాంబర్‌ ఉంది.  తాజాగా సినీ ప్రముఖులంతా ప్రభుత్వాన్ని కలిశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ (FDC Chairman) తరఫున వెళ్లారు. ఇండస్ట్రీకి , ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ వచ్చిందనే అపోహ నిన్నటితో తొలగిపోయింది. అది బెస్ట్‌ మీటింగ్‌ అని అక్కడికి వెళ్లినవాళ్లు నాతో చెప్పారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున మేము గతంలో ప్రభుత్వాన్ని కలిశాం. గద్దర్‌ అవార్డుల విషయంలో కొన్ని సలహాలిచ్చాం. గతంలో మేము కూడా కొన్ని సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేశాం. కానీ, ఉచితంగా ప్రదర్శించాం. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. దీని గురించి ప్రేక్షకులు, నిర్మాతలు ఆలోచించాలి. తాజాగా విడుదలైన ‘పుష్ప2’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంటే మనం ఇప్పటికే ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరాం. అన్ని భాషల్లో సినిమాలు తీసి ప్రేక్షకులను అలరిస్తున్నాం’’ అని చెప్పారు.

సమస్యలు ఉన్నప్పుడే కలుస్తాం...

అయితే తాజాగా జరిగిన మీటింగ్‌లో వాళ్లు సినిమాల గురించి మాట్లాడలేదు. అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరడానికి వెళ్లారు. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలకు మన హీరోలందరూ సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. అది మన డ్యూటీ. మనం సినిమాతో డబ్బులు సొంతం చేసుకుంటున్నప్పుడు సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడే వీడియో చేయడం తప్పులేదు. సినిమాల రిలీజ్‌ సమయంలోనే కాదు ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూనే ఉండాలని నా అభిప్రాయం. లంచం తీసుకొని టికెట్‌ ధరలు పెంచారని వచ్చిన వార్తల గురించి ఇండస్ట్రీ ప్రముఖులతో సీఎం మాట్లాడినట్లు సమాచారం.  ఇండస్ట్రీ   వాళ్లకు గవర్నమెంట్‌ దగ్గరకు తరచూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడే కలుస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదన్నది అసలు విషయమే కాదు. అందరూ అందరినీ విష్‌ చేయలేరు కదా’’ అని అన్నారు.

ఎవరినీ బాధ పెట్టడం కోసం కాదు..

ఇండస్ట్రీలో ఉన్న వారందరూ నాకు పిల్లలతో సమానం. అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు సంతోషించాను. అలానే  సంధ్య థియేటర్‌ ఘటనపై కూడా నా అభిప్రాయాన్ని చెప్పాను. నా ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టడం కాదు. నా పిల్లలతో సమానం కాబట్టి వాళ్ల గురించి మాట్లాడతాను. కొందరి మాట వింటే భవిష్యత్తు బాగుంటుంది. మరి కొందరికి దూరంగా ఉండండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను’’ అని తమ్మారెడ్డి అన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 02:50 PM