Mr.Celebrity: రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని తీసిన థ్రిల్లర్.. ‘మిస్టర్ సెలెబ్రిటీ’
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:33 PM
సుదర్శన్ పరుచూరి హీరోగా వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri) హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ (Mr.Celebrity) అనే సినిమాను ఎన్. పాండురంగారావు (Pandu Ranga Rao), చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మించగా చందిన రవి కిషోర్ (Chandina Ravi Kishore) దర్శకత్వం వహించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), శ్రీ దీక్ష (Sri Deeksha), నాజర్ (Nasar), రఘుబాబు (Raghubabu ) వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
‘రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయని అర్థం అవుతోంది. సుదర్శన్ యాక్టింగ్, యాక్షన్ కూడా ఈ టీజర్‌లో హైలెట్ అవుతోంది. రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని ఈ కథను ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకుడు రవి కిషోర్ తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.
టీజర్ లాంచ్ అనంతరం పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నేను, మా తమ్ముడు కలిసి ఈ సినిమాను చూశాం. మా తమ్ముడు చాలా మంచి విమర్శకుడు. సుదర్శన్ బాగున్నాడని, సినిమా బాగుందని మెచ్చుకున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు.. కానీ మా మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తుతాను అని ఖైదీ కథను సింగిల్ లైన్‌లో చెప్పాం. ప్రేక్షకుడు ఊహించింది జరగాలి.. కానీ ఊహించని టైంలో జరగాలి. ఇవన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సెలెబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్న దర్శకుడు రవి కిషోర్ సినిమాను బాగా తీశారు. గిరిబాబుతో మాకు విడదీయలేని బంధం ఉంది.రఘు బాబు తెరపై అద్భుతంగా నవ్విస్తాడు. సాయి మాధవ్ బుర్రా చాలా మంచి రచయిత. మ్యాటర్ ఉన్న డైలాగ్ రైటర్. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
పరుచూరి సుదర్శన్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీతో ఇండస్ట్రీలోకి పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. నేను హీరో అవుతానని చెప్పగానే మా తాత గారు నాకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవ్వరికీ నా గురించి చెప్పకుండా జూ.ఆర్టిస్ట్‌గా పని చేశాను. సినిమా కష్టాలన్నీ దగ్గరగా చూశాను. ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయాన్ని మా తాత గారికి చెప్పాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించమని చెప్పారు. రఘుబాబు గారి కామెడీతో సెట్‌లో సీన్ చేస్తున్నప్పుడు చాలా నవ్వేవాడ్ని. సాయి మాధవ్ గారంటే నాకు చాలా ఇష్టం. గొప్ప రచయితే కాకుండా మంచి వ్యక్తి. అందరూ మా సినిమాను చూసి మా టీంను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ ప్రయోగాత్మక కథ. సుదర్శన్ గారికి ఈ కథను చెప్పినప్పుడు చాలా బాగుందని అన్నారు. పరుచూరి గారికి స్క్రిప్ట్ చూపించాం. చిన్న చిన్న కరెక్షన్స్ చేశారు. మా హీరో సుదర్శన్ సెట్‌లో అందరి కంటే ముందు వచ్చే వారు. ఎంతో ఒదిగి ఉండేవారు. నిర్మాత గారు మాకు ఏం కావాలో అది ఇచ్చారు.. ఎంత పెద్ద ఆర్టిసుల్ని అయినా మాకు ఇచ్చారు. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని సినిమాలో చూపించాను. చిన్న సమస్యలే కదా? చిన్న మాటలే కదా? అనిపించొచ్చు. కానీ ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమాలో ఉంటుంది. ఈ మూవీకి క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ.. ‘సుదర్శన్ అద్భుతంగా నటించాడు. మొదటి సినిమానే అయినా అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. తెలుగుని చాలా స్పష్టంగా పలికారు. పరుచూరి గారి మనవడు అంటే ఆ మాత్రం ఉంటుంది. నేను ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూడండి’ అని అన్నారు. సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీ అనే టైటిల్‌లోనే చాలా పాజిటివిటీ ఉంది.. తెలిసింది మాట్లాడితే స్వేచ్చ.. తెలియంది మాట్లాడితే నేరం.. తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు.. తెలుసు అనుకుని మాట్లాడటం మహా పాపం.. చాలా మంచి పాయింట్‌తో సినిమాను తీశారు. సుదర్శన్ మంచి నటుడు. నా గురువు గారి మనవడు. నేను కూడా సుదర్శన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన వస్తుంది. దర్శకుడు ఈ మూవీని బాగా తీశాడనిపిస్తుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.