SS Thaman: ఆయన్ని చూసి కన్నీరు ఆగలేదు!

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:59 PM

సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన ఓ మ్యూజిక్‌ కాంపిటీషన్  వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల గురించి తమన మాట్లాడారు.

సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్ (SS Thaman) ఓ మ్యూజిక్‌ కాంపిటీషన్  వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల గురించి తమన మాట్లాడారు. డ్రమ్స్‌ కళాకారుడు శివమణితో (Shiva mani) తనకున్న అనుబంధం గురించి గుర్తు చేశారు. ఇప్పటికీ తమన్  ఏ ప్రాజెక్ట్‌ అంగీకరించిన ఆ సినిమా సంగీతం శివమణితోనే మొదలవుతుంది. అది ఆయనకు ఓ సెంటిమెంట్‌గా ఉండిపోయింది. ఈ సందర్భంగా  తమన్  మాట్లాడుతూ ‘‘1995లో  నాన్న చనిపోయారు. ఆరోజు నా తల్లి, సోదరిని చూసి వాళ్లకు మంచి జీవితాన్ని ఎలా అందించాలా? అని ఆలోచనలో పడ్డా. ఆ సమయంలో నాకు కన్నీరు రాలేదు. ప్రతి ఏడాది అక్టోబర్‌లో శివమణి స్వామి మాల వేసుకొని శబరిమలకు వెళ్తుంటారు. మా నాన్న మరణించారనే విషయం తెలిసిన వెంటనే ఆయన మాల తీసేసి మా ఇంటికి వచ్చారు. ఆయన్ని చూడగానే ఏడుపు వచ్చేసింది’’ అని తమన భావోద్వేగానికి గురయ్యారు. అదే వేదికపై ఉన్న శివమణి కూడా కంటతడి పెట్టుకున్నారు. "ఎస్పీ బాలుతో (SPB) కలిసి  తమన్, శివమణి, కోటి, మణిశర్మ దిగిన ఫొటోను గురించి మాట్లాడుతూ "మా అందరికీ ఆయన మార్గదర్శకులు. మేమంతా ఆయనతో తీసుకున్న చివరి ఫొటో ఇదే. ప్రస్తుతం ఈ స్థాయికి వచ్చానంటే ఆయనే కారణం’’ అని అన్నారు.

Thaman.jpg

ప్రస్తుతం తమన్  వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ లోని ‘జరగండి జరగండి’ పాటపై స్పందిస్తూ.. ‘‘దీనికి సంబంధించిన ఒరిజినల్‌ హుక్‌ స్టెప్పును ఇంకా రిలీజ్‌ చేయలేదు. థియేటర్‌లో ఈ పాటకు ప్రేక్షకులతో డ్యాన్సులు చేయిస్తుంది’’ అని తమన్  చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 05:09 PM