Sreeleela: ప్రతిభలో ఒకరు అలా.. ఒకరు ఇలా.. మాములుగా ఉండదు మరి..

ABN , Publish Date - Dec 22 , 2024 | 09:19 AM

‘కిస్సిక్‌’ అంటూ ‘పుష్ప’తో స్టెప్పులేస్తూ సందడి చేస్తోంది డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల. అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అందాలభామ... నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’తో అలరించేందుకు సిద్ధమైంది.

‘కిస్సిక్‌’ అంటూ ‘పుష్ప’తో స్టెప్పులేస్తూ సందడి చేస్తోంది డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల. అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అందాలభామ... నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇప్పటిదాకా తాను పనిచేసిన హీరోల గురించి చెబుతున్న ముచ్చట్లివి..

Allu.jpg

డ్యాన్సింగ్‌ కింగ్‌

బన్నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతనో డ్యాన్సింగ్‌ కింగ్‌. తన సినిమాల్లో నటన ఒక ఎత్తైతే, డ్యాన్స్‌ మరో ఎత్తు. ‘పుష్ప2’లో ఐటెమ్‌సాంగ్‌ ఎవరు చేస్తారా? అనే ఆసక్తి నాకు కూడా ఉండేది. రకరకాల పేర్లు వినిపించినప్పటికీ చివరికి నా పేరు ఖరారైందని తెలిసి ఉబ్బితబ్బిబ్బయ్యా. కానీ బన్నీతో సాంగ్‌ అనగానే చాలా భయమేసింది. షూటింగ్‌కి ముందు ఎంతో ప్రాక్టీస్‌ చేసి సెట్స్‌కి వెళ్లా. నా టెన్షన్‌ని గమనించి, ‘ఇక్కడ నేను అల్లు అర్జున్‌లా డ్యాన్స్‌ చేయడం లేదు. పుష్పరాజ్‌లా చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన పనిలేద’ని చెప్పి నా కంగారు పోగొట్టారు బన్నీ. అతను సెట్‌లో ఉంటే తెలియని పాజిటివ్‌ వైబ్‌ వస్తుంది. అందర్నీ ఉత్సాహపరుస్తారు.

Mahesh.jpg

మనసు బంగారం

మహేష్‌బాబులో ఏం మ్యాజిక్‌ ఉందో గానీ.. ఆయన్ను చూస్తూ నేను చెప్పాల్సిన డైలాగ్స్‌ కూడా మర్చిపోయేదాన్ని. ‘గుంటూరుకారం’ మొదటిరోజు షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లగానే మా వాళ్లందరూ నన్ను చుట్టుముట్టేసి, మహేష్‌ గురించి ఒక్కటే ప్రశ్నలు. ‘బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్‌ను చూస్తే అర్థమవుతుంద’ని సింగిల్‌ లైన్‌లో వాళ్ల్లకు సమాఽధానమిచ్చా. ఆయన మనసు కూడా బంగారమే. ‘గుంటూరు కారం’ సినిమా చూడడానికి ముంబైలో థియేటర్‌కి వెళ్లా. చెప్తే నమ్మరుగానీ... తెరపైన మహేష్‌ కనిపించిన ప్రతీసారి థియేటర్‌లో ఒకటే అరుపులు, కేకలు.

Nithiin.jpg

అల్లరే అల్లరి

నితిన్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. అతన్ని చూసే సహనంగా ఉండటం ఎలాగో నేర్చుకున్నాను. సినిమా కోసం చాలా కష్టపడతారు. ఇద్దరం సెట్‌లో ఉన్నామంటే అల్లరే అల్లరి. సరదాగా జోక్స్‌ వేసుకుంటాం, ప్రాంక్స్‌ చేసుకుంటాం. అతనితో వరుసగా రెండు సినిమాలు చేయడం వల్ల ఇప్పుడు మేము మంచి స్నేహితులమయ్యాం.

NBK.jpg

ఎంత మంచివారో...

బాలయ్యగారితో సినిమా అనగానే మొదట కాస్త భయమేసింది. కానీ ఆయన్ని నేరుగా కలిసి మాట్లాడాక ఎంత మంచివారో అర్థమైంది. నిజానికి బాలయ్య బయట వేరు, కెమెరా ముందుకొస్తే వేరు. ఒక్కసారి పాత్రలోకి దిగారంటే ఇక దబిడి దిబిడే. సినిమాలతో పాటు ఇతర రంగాలపైనా ఆయనకి పరిజ్ఞానం ఉంది. నేను మెడిసన్‌ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని చాప్టర్స్‌ గురించి లోతుగా మాట్లాడేవారు. ‘ఈయన వైద్య విద్య చదవలేదు కదా! ఎలా తెలుసు’ అని ఆశ్చర్యపోయేదాన్ని.

Sl.jpg

చాలా ప్రత్యేకతలున్నాయి...

కెరీర్‌ తొలినాళ్లలోనే రవితేజ లాంటి స్టార్‌ హీరోతో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టం. ఆయన నటించిన ‘కిక్‌’, ‘విక్రమార్కుడు’ ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. పాత్రలో వేరియేషన్స్‌ని చాలా ఈజీగా చూపించగలరు. ఆయనలో చాలా ప్రత్యేకతలున్నాయి. ‘ధమాకా’ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణలో ఆయన కాలికి దెబ్బతగలడంతో 12 కుట్లు పడ్డాయి. అయినా సరే విశ్రాంతి తీసుకోకుండా నొప్పిని భరిస్తూనే తర్వాత రోజు ‘దండకడియాల్‌’ సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. పనిపట్ల ఆయన నిబద్ధత చూసి నాకు ఆశ్చర్యమేసింది. రవితేజ చాలా కూల్‌ పర్సన్‌.

Updated Date - Dec 22 , 2024 | 09:45 AM