NBK: ఎన్ని బిరుదులు, ట్యాగ్స్ తగిలించినా.. బాలయ్యకు అలా పిలిస్తేనే ఇష్టం

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:06 PM

‘జై బాలయ్య’.. అని వినబడితే చాలు నందమూరి అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్టీఆర్ వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా వెండితెరపై బాలయ్య తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. మాస్ హీరోగా ఎంత పాపులర్ అయ్యారో.. అంతే వైవిధ్యమైన జోనర్ సినిమాలను చేస్తూ వచ్చారు. బాలయ్య సినీరంగ ప్రవేశం చేసి నేటికి (ఆగస్ట్ 30కి) 50 వసంతాలు. ఆయనపై ఓ స్పెషల్ స్టోరీ..

Nandamuri Balakrishna

‘జై బాలయ్య’ (Jai Balayya) అనే స్లోగన్ నేడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌..‌ కేవలం ఆ పేరు పేరు వింటే చాలు నందమూరి అభిమానుల (Nandamuri Fans) రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్టీఆర్ (NT Ramarao) వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా వెండితెరపై బాలయ్య తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. మాస్ హీరోగా ఎంత పాపులర్ అయ్యారో.. అంతే వైవిధ్యమైన జోనర్ సినిమాలను చేస్తూ వచ్చారు. బాలయ్య సినీరంగ ప్రవేశం చేసి నేటికి (ఆగస్ట్ 30కి) 50 వసంతాలు..

Also Read- NBK@50: ఇన్విటేషన్స్ రాలేదనే ఫిర్యాదులపై.. ఆర్గనైజర్స్ ఏమన్నారంటే..


ఎన్టీఆర్ (NTR) నట వారసుడిగా కెరీర్ ప్రారంభించిన బాలయ్య..‌ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నటీనటులు తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఆ సంప్రదాయాన్ని మన దేశంలో మహా నటుడు పృథ్విరాజ్‌ కపూర్‌ అనుసరించారు. ఆయన తనయులు రాజ్‌ కపూర్‌, షమ్మీ కపూర్‌, శశి కపూర్‌ తండ్రి లాగానే నటనను వృత్తిగా స్వీకరించి తమదైన బాణీ పలికించారు. రాజ్‌ కపూర్‌ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకొని తన ముగ్గురు కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దక్షిణాది మహా నటుడు నందమూరి తారకరామారావు ఈ విషయంలో రాజ్‌ కపూర్‌‌ను అనుసరిస్తూ తొలిసారిగా తెలుగు నాట తన తనయులు హరికృష్ణ, బాలకృష్ణను నటనా రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహించారు. అయితే నట వారసుల్లో ఎవరికీ లేనంత సుదీర్ఘమైన కెరీర్‌ మాత్రం బాలకృష్ణ సొంతమైంది.


BK.jpg

14 ఏళ్ల వయసులో తొలిసారిగా తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చారు నటసింహం బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఈ చిత్రం విడుదలైంది. తొలి చిత్రంతోనే నందమూరి నట వారసత్వాన్ని నిలబెడతాడనే నమ్మకాన్ని ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ కలిగించారు. నటన బాలయ్య బాబు రక్తంలోనే ఉంది అని అందరూ ప్రశంసించారు. ‘తాతమ్మ కల’కు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశ పెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్‌ నిర్మించిన సినిమా ఇది. యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి, చిన్న చిన్న మార్పులతో మళ్లీ విడుదల చేశారు. రెండు సార్లు సెన్సార్‌ అయి, రెండు సార్లు విడుదలైన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఇందులో బాలకృష్ణ (Balakrishna)ది కథలో కీలకమైన పాత్ర.

Also Read- NBK@50: టచ్‌ చేయని జానర్‌ లేదు.. అదే స్పెషల్‌!


లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా అరంగేట్రం చేసినా అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను బాలయ్య సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు చేసిన బాలయ్య.. పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఎన్టీఆర్ తర్వాత తన జనరేషన్‌లో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస, సైన్స్ ఫిక్షన్, సాంఘిక చిత్రాలు చేసిన ఏకైక కథానాయకుడు బాలకృష్ణ మాత్రమే. నటుడిగా ‘అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి’ వంటి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న బాలకృష్ణకు ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం సోలో హీరోగా అతి పెద్ద బ్రేక్ ఇచ్చింది. అనంతరం వరుసగా అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. సినిమా సినిమాకు తనస్థాయి పెంచుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్‌ అనితర సాధ్యంగా అభినయించిన శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను బాలకృష్ణ సైతం పోషించి అభిమానుల్ని అలరించారు. అంతే కాదు ఎన్టీఆర్‌ పోషించని అభిమన్యు, నారద, ఆంజనేయ పాత్రలను బాలకృష్ణ పోషించి అభినందనలు అందుకున్నారు. పెద్దాయన ‘పాతాళ భైరవి’ వంటి జానపద చిత్రాల్లో నటిస్తే, బాలయ్య ‘భైరవద్వీపం’ సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నారు.


N-Balakrishna.jpg

ఒకే చిత్రంలో అటు భగవంతుడు, ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగు నాట ఎన్టీఆర్‌, బాలకృష్ణలకే దక్కింది. 1964లో వచ్చిన ‘శ్రీ సత్యనారాయణ మహత్మ్యం’లో ఎన్టీఆర్‌ శ్రీ మహా విష్ణువుగా, సత్యవ్రతుడిగా నటించారు. అలాగే ‘పాండురంగడు’లో బాలయ్య శ్రీకృష్ణ, పుండరీక పాత్రలతో మెప్పించారు. బాలకృష్ణ ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో కాలేదు. ఆయన నటిస్తేనే అది ట్రెండ్‌ అయింది. ఆ ట్రెండ్‌ను తర్వాత మిగిలిన హీరోలందరూ ఫాలో కావడం గమనార్హం. డిస్కో డ్యాన్సులు, మెషిన్‌గన్స్‌తో యాక్షన్‌ సినిమాలు వస్తున్న రోజుల్లో బాలకృష్ణ పంచె కట్టుతో, కర్ర సాముతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయి.

అలాగే తెలుగులో ఫ్యాక్షన్‌ సినిమాల నిర్మాణం బాగా పెరగడానికి బాలకృష్ణ నటించిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ చిత్రాల సంచలన విజయమే ప్రధాన కారణంగా చెపుతూ ఉంటారు. తండ్రి పేరుతో తీసిన బయోపిక్‌ సినిమాలలో తనయుడు హీరోగా నటించిన సందర్భాలు గతంలో లేవు. అరుదైన ఆ ఘనత బాలయ్యకే దక్కింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘కథానాయకుడు, మహనాయకుడు’ చిత్రాల్లో బాలయ్య ఎన్టీఆర్‌‌గా కనిపించడం అభిమానులను అలరించింది.

బాలకృష్ణ సినిమాల్లో ‘కథానాయకుడు, రాము, బాబాయ్ అబ్బాయి, ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, ఆదిత్య 369, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలిసింహం, ముద్దుల మొగుడు, పెద్దన్నయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహా, అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి’ ఇలా 50 ఏళ్ళ ఆయన నట జీవితంలో ఎన్నో మరచిపోలేని మధురమైన చిత్రాలు, ఆయన తప్ప మరెవరూ చెయ్యలేని పాత్రలు కనిపిస్తాయి. (NBK Top Movies)


Balu.jpg

ఇక బాలయ్య నటించిన ఇటీవలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచి ఆయనకు హ్యాట్రిక్ హీరోగా పేరు తీసుకువచ్చాయి. సినిమాలతో పాటు, రాజకీయాలలో సైతం బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మేల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అన్ స్టాపబుల్ అంటూ హోస్ట్‌గా బాలయ్య తనలోని మరో కోణాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. ఓ పక్క ప్రజాసేవ చేస్తూనే, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ చైర్మన్‌గా బాలయ్య తన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ బాటలోనే తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలని, చరిత్రను ప్రేక్షకులకు తెలియజేయాలని, తన అభిమానులను అలరించాలని, వారిని గొప్ప వారిగా చూడాలని తాపత్రయ పడుతుంటారు. బాలయ్య మనిషి గంభీరం..‌ కానీ మనసు వెన్న.. కల్మషం తెలియని భోళాశంకరుడు బాలయ్య. సినీ రాజకీయ సేవ రంగాలలో ఐదు దశాభ్దాలుగా నందమూరి వారసత్వాన్ని కాపాడుకొస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అభిమానులు తన పేరు ముందు ఎన్ని బిరుదులు, ట్యాగ్స్ తగిలించినా.. బాలయ్య బాబు అని పిలిస్తేనే ఆయనకి ఆనందం, ఇష్టం.

నిజానికి ఎన్టీఆర్‌ వంటి మహానటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం, మరో రకంగా అగ్నిపరీక్ష కూడా. తండ్రి పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ. నిజానికి ఏ నటుడైనా మూడు నాలుగు దశాబ్దాలపాటు కథానాయకుడిగా నటించి, ఆ తర్వాత క్యారెక్టర్‌ పాత్రలకు షిఫ్ట్‌ అవుతూ ఉంటారు. కానీ బాలకృష్ణ విషయం చాలా ప్రత్యేకం. తొలి సినిమా ‘తాతమ్మ కల’ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఏడాది కూడా గ్యాప్‌ తీసుకోకుండా హీరోగానే నటిస్తూ యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ ఒకటిన దక్షిణాది చిత్రపరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు భారీ సన్మానాన్ని (Nandamuri Balakrishna Golden Jubilee Celebrations) తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్వహించనుంది.‌ బాలయ్య ఇలానే నటుడిగా, నాయకుడిగా, సేవకుడిగా తెలుగు వారిని అలరించాలని, తన సేవలను కొనసాగించాలని కోరుకుంటూ నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.

Read Latest Cinema News

Updated Date - Aug 30 , 2024 | 11:06 PM