Keedaa Cola: తరుణ్ భాస్కర్.. సినిమాలో షేర్, రూ. కోటి ఇవ్వాల్సిందే! ఎస్పీ చరణ్ లీగల్ నోటీస్
ABN , Publish Date - Feb 21 , 2024 | 05:02 PM
దివంగత గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం కుమారుడు సింగర్ ఎస్పీ చరణ్, ‘కీడా కోలా’ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ మధ్య ఇష్యూ ముదిరి పాకాన పడింది.
దివంగత గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం (SP Balasubramaniyam) వాయిస్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారనే అంశంలో ఆయన కుమారుడు సింగర్ ఎస్పీ చరణ్ (SP Charan), ‘కీడా కోలా’ (Keedaa Cola) చిత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) మధ్య జరుగుతున్న ఇష్యూ ముదిరి పాకాన పడింది. గత వారం పది రోజుల క్రితం ఈ వివాదం తెరమీదకు రాగా ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది.
తరుణ్ భాస్కర్, చైతన్య రావు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో 2023 నవంబర్‌లో విడుదలైన కీడా కోలా చిత్రం యావరేజ్‌గా నిలిచింది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే.. సినిమాలో ఒకటి రెండు సందర్భాల్లో బాలకృష్ణ బంగారు బుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంత అనే పాటతో పాటుగా, గట్టిగా పట్టనా ఓ పట్టు.. సోకులనే చేయనా హాం ఫట్టూ అంటూ సాగే రెండు పాటలలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubramaniyam) వాయిస్‌ను రీక్రియేట్ చేసి వాడారు.
ఈ విషయమై ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ (SP Charan) సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), సంగీత దర్శకుడు వివేక్ సాగర్ (Vivek Sagar)లకు వివరణ ఇవ్వాలని మొదట నోటీస్ పంపించారు. అయితే వారిచ్చిన వివరణ సంతృప్తి ఇవ్వక పోవడంతో రీసెంట్‌గా మరోసారి స్ట్రాంగ్‌గా లీగల్ నోటీసులు పంపించారు.
ఎస్పీ చరణ్ (SP Charan) మాట్లాడుతూ.. ‘కీడా కోలా’ (Keedaa Cola) చిత్రం టీమ్ మా కుటుంబం అనుమతి తీసుకోకుండా మా తండ్రి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (SP Balasubramaniyam) గారి వాయిస్‌ను ఏఐతో రీక్రియేట్ చేయడం మమ్మల్ని అవమానించడమేనని, మాకు సమాచారం ఇచ్చి చేసి ఉంటే బాగుండేదని అలా చేయకపోవడం బాధగా ఉందన్నారు. ఇలా అనైతిక చర్యకు పాల్పడిన చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పి, రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, సినిమా రాయల్టీలో షేర్ ఇవ్వాలంటూ నోటీసులు పంపించారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.