Maheshbabu Foundation: నీట్‌లో మంచి మార్కులు.. కానీ చదివించే స్తోమత లేదు!

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:04 PM

మహేష్‌బాబు (MaheshBabu) ముద్దుల కూతురు సితారకు (Sitara) సేవాగుణం ఎక్కువ. వయసులో చిన్నదే అయినా మనసు మాత్రం పెద్దది. పేదలు, అవసరార్థులు చేతనైన సాయం చేసి ఆదుకుంటూ ఉంటుంది

మహేష్‌బాబు (MaheshBabu) ముద్దుల కూతురు సితారకు (Sitara) సేవాగుణం ఎక్కువ. వయసులో చిన్నదే అయినా మనసు మాత్రం పెద్దది. పేదలు, అవసరార్థులు చేతనైన సాయం చేసి ఆదుకుంటూ ఉంటుంది. తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. సితార మరోసారి తన  మంచి మనసు చాటుకుంది.  సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్‌ చదవాలనుకున్న పేద విద్యార్థికి సాయం చేసి అండగా నిలిచింది. ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్‌(Namratha) తన ఇన్‌స్టా ద్వారా ఇలా పంచుకున్నారు.

‘రోజు కూలీ తన కూతురు నవ్యను చదివించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాడు. ఆమె కూడా నీట్‌ (NEET Exams) పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె డాక్టర్‌ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. తన కలలను సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది. అయితే, ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలిచింది. దీంతో మహేష్‌ బాబు ఫౌండేషన్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ ఎడ్యుకేషనల్‌ ఫండ్‌ ద్వారా నవ్యశ్రీకి (Navya Sri) సాయం చేసేందుకు  ముందుకొచ్చింది. మెడికల్‌ విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు కాలేజీ, హాస్టల్‌ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్‌స్టార్‌ కృష్ణ ఎడ్యుకేషనల్‌ ఫండ్‌ అందిస్తోంది. మా లిటిల్‌ ప్రిన్సెస్‌ (సితార) తన పుట్టినరోజును కూడా నవ్యతో జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెను అభినందించడంతోపాటు కాబోయే డాక్టర్‌కు ల్యాప్‌టాప్‌, స్టెతస్కోప్‌ను బహుమతిగా ఇచ్చింది.’ అని నమ్రత తెలిపింది.


2024లో జరిగిన నీట్‌ ఎగ్జామ్స్‌లో నవ్యశ్రీ 605 మార్కులు సాధించింది. సాధారణ కళాశాలలో చదవి తన ప్రతిభతో టాప్‌ స్కోర్‌ సాధించి ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలో సీట్‌ సాధించింది. కానీ, పుస్తకాలు, హాస్టల్‌ ఫీజు, కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో నవ్య కుటుంబం ఉంది. దీంతో మహేష్‌ బాబు ఫౌండేషన్‌, కృష్ణ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ను నవ్య సంప్రదించింది. ఆమె కలలకు మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ఊపిరి పోసింది. రూ. 1,25,000 చెక్కుతో పాటు తన మెడిసన్‌ విద్య పూర్తి అయ్యే వరకు తమ సంస్థ నుంచే డబ్బు అందుతుందని ఘట్టమనేని కుటుంబం  భరోసా ఇచ్చింది.  

Updated Date - Jul 22 , 2024 | 12:07 PM