Satyadev: కచ్చితంగా హిట్ అనుకున్న ప్రతిసారి ఎదురుదెబ్బ తగిలేది
ABN , Publish Date - Nov 24 , 2024 | 02:53 PM
టాలెంట్ ఉన్నా.. సరైన గుర్తింపుకు నోచుకోని హీరోలలో సత్యదేవ్ ఒకరు. ఆయన సినిమాలలో మంచి కంటెంట్ ఉంటుంది. అలాగే నటన పరంగా 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్.. ‘జీబ్రా’తో తన రాత మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తన కెరీర్ గురించి సత్యదేవ్ ఏమన్నారంటే..
భావోద్వేగాలను సునాయాసంగా పండించగల టాలీవుడ్ నటులలో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘జీబ్రా’ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఆనందంలో ఉన్న సత్యదేవ్.. తన నటనా ప్రస్థానం గురించి, ఇంతకు ముందు సక్సెస్ వచ్చినట్లుగా వచ్చి తృటిలో తప్పిపోతుంటే ఎలా ఉండేదో షేర్ చేసుకున్నారు.
Also Read-Tollywood: ఈ రెండు నెలలు సందడే సందడి.. సినీ ప్రియులకు పండగే
ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బావుందనిపిస్తోంది. కానీ ఎందుకో నాకు రావాల్సినన్ని విజయాలు రాలేదనిపిస్తుంది. ‘బ్లఫ్ మాస్టర్’ బావుందని ఇప్పుడు అనేక మంది చెబుతూ ఉంటారు. కానీ అది పెద్ద విజయం సాధించలేదు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాను ఇప్పటికీ మెచ్చుకుంటారు. కానీ కొవిడ్‌వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ‘తిమ్మరసు’ కూడా చాలా మంచి సినిమా. అది విడుదలయ్యే సమయంలో కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. సినిమా హాళ్లలో 50 శాతం మందినే అనుమతించేవారు. దాంతో అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత ‘కృష్ణమ్మ’ రెండేళ్లు ఆగిపోయింది. ఆ సినిమా విడుదలయిన వెంటనే.. అంటే ఆరు రోజులకే ప్రైమ్ ఓటీటీలో వదిలేశారు. దీంతో కలెక్షన్లు సరిగ్గా రాలేదు. ఇప్పుడు ‘జీబ్రా’తో విజయం సాధించాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నా సినిమాలు విజయాలు సాధించటానికి ఎంత చేయగలనో అంత చేస్తున్నాను. విజయాలు వచ్చే వరకు పట్టుదల వీడను. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను.
ఇక విజయాలు తృటిలో తప్పిపోతుంటే మొదట్లో చాలా బాధగా అనిపించేది. ‘కచ్చితంగా అవుతుంది’ అనుకున్నప్పుడల్లా ఎదురుదెబ్బ తగిలేది. దాని నుంచి బయట పడి మళ్లీ ట్రాక్ ఎక్కామనుకున్నప్పుడు మరో దెబ్బ.. ఇప్పటి వరకు ఇలా గడిచింది. దీనితో బహుశా నా ప్రయాణం ఇంకా మొదలవలేదు అనే సిద్ధాంతాన్ని నమ్మటం మొదలు పెట్టాను. కొందరికి అతి త్వరగా విజయం లభిస్తుంది. 25 ఏళ్లకే సీఈఓలు అయిపోతారు. 50 ఏళ్లు వచ్చేసరికి పతనం అంచుకు చేరుకుంటారు. కొందరు 50 ఏళ్లకు విజయం సాధించవచ్చు. కానీ ఆ విజయం వారి జీవితం చివరి దాకా ఉంటుంది. నాకు కూడా అంతేనేమో అనుకుంటాను. చాలా మంది ఒక శుక్రవారంతో నటుల జీవితం మారిపోతుందని అనుకుంటూ ఉంటారు. బహుశా ఆ శుక్రవారం నా జీవితంలో ఇంకా రాలేదు. ఇప్పటి వరకు నేను పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లలో సినిమాలు చేయలేక పోయాను. నాకు అలాంటి ఛాన్స్ దొరకలేదు. ‘జీబ్రా’ తర్వాత నాకు అలాంటి అవకాశాలు వస్తాయనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.