Sankranti 2025: మరోసారి మైత్రీ వర్సెస్ దిల్ రాజు.. ‘రాబిన్ హుడ్’తో రచ్చ
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:01 PM
సంక్రాంతి అంటే చాలు టాలీవుడ్‌లో థియేటర్ల రచ్చ ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతికి మ్యాగ్జిమమ్ దిల్ రాజు హవానే ఉండబోతుందని అంతా అనుకుంటున్న సమయంలో.. మైత్రీ వారు సడెన్ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా మైత్రీ వర్సెస్ దిల్ రాజు ఎలా అయితే నడిచిందే.. ఈ సంవత్సరం కూడా వారి మధ్య పోటీ ఉండబోతుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే..
సంక్రాంతి అంటే చాలు.. టాలీవుడ్ రచ్చ మాములుగా ఉండదు. మా సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు, వాళ్ల సినిమాకు ఎక్కువ థియేటర్లు తీసుకున్నారు.. ఇలాంటి రచ్చ గత కొన్ని సంక్రాంతులుగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్రాంతి టైమ్‌లో ఎక్కువగా వినిపించే పేరు నిర్మాత దిల్ రాజుదే. మళ్లీ ఆయనే అన్నీ అడ్జస్ట్ చేసి.. అనుకున్న అన్ని సినిమాలు విడుదలయ్యేలా చూస్తుంటారు. కానీ రెండు సంవత్సరాలుగా దిల్ రాజుకు పోటీగా మైత్రీ వారు దిగుతుండటంతో సంక్రాంతి ఫైట్ మరింత రంజుగా మారుతోంది. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి కూడా సడెన్‌గా ‘రాబిన్ హుడ్’తో మైత్రీ పోటీకి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అయితే మాత్రం మరోసారి సంక్రాంతికి థియేటర్ల ఫైట్ తప్పదు.
Also Read- Mohan Babu: ఎవరూ ఊహించని విధంగా.. మోహన్ బాబు క్షమాపణ
ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు మూడు సినిమాల విడుదల ఉంటుందని అధికారికంగా రిలేజ్ డేట్స్‌తో సహా ప్రకటనలు వచ్చేశాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’తో పాటు బాలయ్య ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదల తేదీని ప్రకటించి.. సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో రెండు సినిమాలు దిల్ రాజు నిర్మిస్తోన్న సొంత సినిమాలు అయితే.. బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే మూడు సినిమాలు దిల్ రాజువే. ఇంక పోటీ ఏముందిలే అని అనుకున్నారు కానీ.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ వారి ‘పుష్ప 2’ చిత్రం కలెక్షన్స్ బాగుండటంతో ఆ సినిమా లాంగ్ రన్ కోసం.. డిసెంబర్ 25న రావాల్సిన వారి బ్యానర్ చిత్రం ‘రాబిన్ హుడ్’ (నితిన్ హీరో)ను వాయిదా వేసినట్లుగా టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే ‘రాబిన్ హుడ్’ను ఇప్పుడు మైత్రీ వారు సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్లుగా టాక్ వినబడుతోంది. జనవరి 13న ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని విడుదల చేయాలని మైత్రీ అధినేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నిజంగా ‘రాబిన్ హుడ్’ సంక్రాంతికి ఫిక్స్ అయితే మాత్రం థియేటర్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. మైత్రీ వారు తమ సినిమా కోసం అప్పుడే థియేటర్లను కూడా బ్లాక్ చేస్తున్నారనేలా వార్తలు మొదలయ్యాయి. మరి ఈ సడెన్ ఎంట్రీపై దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి గత రెండేళ్లుగా సంక్రాంతి సినిమాల పరంగా మైత్రీ, దిల్ రాజుల మధ్య ఆసక్తికరమైన పోటీ ఉంటూ వస్తోంది. 2023లో వీరు నిర్మాతలుగా పోటీ పడగా.. 2024లో ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్‌గా పోటీ పడ్డారు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ రాకతో 2025లోనూ వారి మధ్య పోటీ ఏర్పడబోతోంది. అసలు ‘రాబిన్ హుడ్’ సంక్రాంతి బరిలో ఉందా? లేదా? అనేది మాత్రం మైత్రీ వారు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.