Sandhya Theatre Stampede: బాలుడి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యుల రిపోర్ట్.. ఏం చెప్పారంటే
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:52 PM
తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన 9 ఏళ్ళ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు నివేదిక అందజేశారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా ఆమె కుమారుడుని ICUలో చేర్చి చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలుడి ఆరోగ్యం విషయంలో పలు విభిన్న వార్తలు ప్రచారం కావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు నివేదికను విడుదల చేశారు.
శ్రీతేజ్ కి ఇంకా వెంటిలేటర్ పైనే సేవలు అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అడపాదడపా జ్వరం వస్తుందని తెలిపారు. ట్యూబ్ ద్వారా అందిస్తున్న ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాడని చెప్పారు. అయితే సెన్సోరియం ద్వారా బాలుడిలో కదలికలను గుర్తిస్తున్నామని చెప్పారు. మరోవైపు పనిగట్టుకొని మరి కొందరు బాలుడి ఆరోగ్యం విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని అల్లు అర్జున్ టీమ్ ఆరోపించింది. బన్నీకి అత్యంత సన్నిహిత వర్గం బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
అసలు ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందురోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. ‘పుష్ప2’ సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై నమోదైంది.