Ram Charan: చరణ్‌పై విమర్శలు.. స్వామీజీ కౌంటర్
ABN , Publish Date - Nov 21 , 2024 | 02:32 PM
కడప దర్గాకి అయ్యప్ప దీక్షలో చరణ్‌పై విమర్శలు గుప్పుమంటున్న వేళా ఆయనకు మద్దతు కూడా పెరుగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ చరణ్‌కి అండగా నిలిచారు. ఆయన ఏమన్నారంటే..
ఇటీవల హీరో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో కడప దర్గాను సందర్శించిన నేపథ్యంలో విమర్శలు గుప్పుమన్న విషయం తెలిసిందే. స్నేహితుడు ఏఆర్ రెహమాన్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అయ్యప్ప మాలలో ఉన్నా కూడా చరణ్ దర్గాని సందర్శించడం విశేషం. దర్గాని సందర్శించిన ఆయన ఇస్లాం నియమాల ప్రకారమే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై వస్తున్న విమర్శలకి ఇప్పటికే ఉపాసన స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా ఆమెకి తోడుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ నిలిచారు. ఆయన ఏమన్నారంటే..
సాధారణంగా అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఎంతో నిష్ఠతో కఠినమైన నియమాలను పాటిస్తుంటారు. ఎవరైనా మాలలో ఉండగా శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాలి, అలాంటిది ఆయన ఏకంగా ఇలా దర్గాకి వెళ్లడం ఏమిటి అని కొందరు ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై రాధా మనోహర్ దాస్ స్పందిస్తూ.. " రామ్ చరణ్ నిజమైన భక్తుడు. శివాలయాన్ని శుభ్రం చేసాడు. వారి పాపకు క్లీంకార అనే పేరు పెట్టాడు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌కు విదేశాలకు వెళ్లినపుడు రాములవారిని క్యారీ చేసాడు.ఎవరికైనా చరణ్ తప్పు చేసినట్లు అనిపిస్తే నా దగ్గరికి రండి కూర్చొని మాట్లాడుదాం. అంతేకాని ఆయన గురించి తప్పుగా మాట్లాడ వద్దు" అన్నారు.
అంతకు ముందు ఉపాసన మాట్లాడుతూ.. "మేము భారతీయులుగా అన్ని ధర్మాలని గౌరవిస్తాం. ధర్మం అనేది ఒకటి చేస్తుంది తప్ప ఎవరిని విడగొట్టదు. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. చరణ్ దానినే అనుసరించాడు" అంటూ కామెంట్ చేశారు.