Pushpa 2: పుష్ప టికెట్ రేట్లకి కళ్లెం.. తెలంగాణ

ABN , Publish Date - Dec 02 , 2024 | 09:31 PM

తెలంగాణ ప్రభుత్వం 'పుష్ప 2' మూవీ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరికొత్త ట్విస్ట్‌తో.. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఏర్పడింది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2) చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు (Ticket Rates Hike) రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే చిన్న ట్విస్ట్ ఏర్పడింది. ఏంటంటే..


తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్‌ షోతోపాటు, అర్థరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్‌ ధరను అదనంగా రూ.800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.. ఈ పెంపుతో సింగిల్‌ స్క్రీన్ లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది. ఇక అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్ లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంచడానికి అనుమతి ఇచ్చారు. డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు సింగిల్‌ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ధరల పెంపుపై పలువురు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ పిటిషన్ పై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో 12 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్‌ యాప్‌ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉంది’’ అని మైత్రీ మూవీస్‌ నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Updated Date - Dec 02 , 2024 | 09:31 PM