SS Rajamouli: ఆ ఒక్క సీన్‌తో సినిమా ఏంటో అర్థమైపోయింది
ABN , Publish Date - Dec 03 , 2024 | 08:21 AM
"సుకుమార్ లేకపోతే నేను లేను. ఇంత గొప్ప దర్శకుడు మన దగ్గర ఉన్నారా అని గర్వపడేలా చేశారు. ఈ సినిమా కోసం మేమందరం జీవితాలు పెట్టాం. మా అందరికీ గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకున్నా’’ అని అల్లు అర్జున్ అన్నారు.
"సుకుమార్(Sukumar) లేకపోతే నేను లేను. ఇంత గొప్ప దర్శకుడు మన దగ్గర ఉన్నారా అని గర్వపడేలా చేశారు. ఈ సినిమా కోసం మేమందరం జీవితాలు పెట్టాం. మా అందరికీ గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకున్నా’’ అని అల్లు అర్జున్ (Allu arjun) అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2’ (Pushpa 2)రష్మిక కథానాయిక(Rashmika mandanna). శ్రీ లీల (Shree leela) ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోవైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి అతిథిగా హాజరయ్యారు.
అయన మాట్లాడుతూ "ఏదైనా సినిమా వేడుకకి వచ్చినప్పుడు మన మాటలతో ఆ సినిమాకి ఏదో రకంగా మంచి జరగాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంటాం. ఈ సినిమా గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని పొగడటం కంటే ఒక సరదా విషయం పంచుకుంటా. రెండు మూడు నెలల కిందట రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘పుష్ప2’ చిత్రీకరణ జరుగుతుంటే అక్కడిరి వెళ్లా. బన్నీ, సుక్కుతో కాసేపు మాట్లాడిన తర్వాత ‘సినిమాలో ఒక సన్నివేశం చూస్తారా?’ అని అడిగారు సుకుమార్. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ అది. ఆ ఒక్క సీన్‌తో అర్థమైపోయింది. ఈ సన్నివేశానికి దేవిశ్రీప్రసాద్ ఎంత సంగీతం ఇవ్వగలిగితే అంత తీసుకోండి అని చెప్పా. సుకుమార్ ఎంత స్థాయికి కావాలంటే అంత స్థ్థాయికి తీసుకెళ్లాడు. బన్నీ నటనతో అదరగొట్టేశాడు. దాని తర్వాత సినిమా మొత్తం ఎలా ఉంటుందో, డిసెంబరు 4నే ప్రపంచానికి అర్థమైపోతుంది. వర్షం పడుతుంది. ఇది శుభ సూచకం’’ అన్నారు.
అసలు తగ్గేదేలే: అల్లు అర్జున్
"పుష్ప సినిమా విడుదయ్యే సమయానికి పుష్ప-2 కథ వినలేదు. తొలి సినిమా అప్పుడే చెప్పా తగ్గేదేలే అని. ‘పుష్ప2’ విషయంలో అస్సలు తగ్గేదేలే. మూడేళ్ల తర్వాత నా అభిమానుల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం నిర్మాతలు కోట్లు ఖర్చు చేశారు. మైత్రీ నిర్మాతలు కాకుండా మరే నిర్మాతల ఈ సినిమా చేయలేరు. మా టీమ్ అందరికీ ఐదేళ్ల కష్టం ఈ సినిమా. పాటలు అందరూ ఇస్తారు. దేవిశ్రీప్రసాద్ ప్రత్యేకమైన ప్రేమతో నాకు పాటలు ఇస్తాడు. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. కేరళ వాళ్లు కూడా గర్వపడేలా యాక్ట్ చేశాడు. శ్రీలీల డ్యాన్స్ చూసి ఇష్టపడేవాణ్ని. తొలిసారి తనతో పనిచేశాక తన గురించి తెలిసింది. తనకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ తరానికి, తెలుగమ్మాయిలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. నేను ఐదేళ్లుగా పనిచేస్తున్న ఒకే ఒక కథానాయిక రష్మిక. తనంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాకు చాలా కష్టపడింది. పీలింగ్స్ సాంగ్ కోసం రెండు రోజులు నిద్ర లేకుండా పని చేసింది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. తను లేకపోతే నేను లేను. ఇంత గొప్ప దర్శకుడు మన దగ్గర ఉన్నారా అని గర్వపడేలా చేశాడు. ఈ సినిమా కోసం మేమందరం జీవితాలు పెట్టాం. మా అందరికీ గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకున్నా. ‘బాహుబలి’ ఆడినప్పుడు మనందరం గర్వించాం. ఇది మా సినిమా, మా అందరి స్థాయిని పెంచిందని భావించాం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలైనప్పుడు ఇది మన సినిమా, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తుందని గర్వపడ్డాం. అలా తెలుగువారికి పేరు తీసుకు రావాలనే ఒక తపనతో భక్తితో ప్రేమతోనే ‘పుష్ప’ సినిమాల్ని చేశాం. 12 వేలకుపైగా థియేటర్లలో, 80 దేశాల్లో, 6 భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ‘పుష్ప2’ సినిమాతో సంబరం చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం నేను పడిన కష్టం అభిమానులకి అంకితం ఇస్తున్నా’’ అని అన్నారు.
బన్నీపై ఉన్న ప్రేమేతోనే: సుకుమార్
"బన్నీతో నా ప్రయాణం ‘ఆర్య’తో మొదలైంది. వ్యక్తిగా, నటుడిగా తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చా. ‘పుష్ప’ చిత్రాలు ఇలా తయారయ్యాయంటే కారణం తనపై నాకున్న ప్రేమే కారణం.‘‘ఈ సినిమా చేయడం వెనక అల్లు అర్జున్‌పై ప్రేమ తప్ప మరేమీ కాదు. మా ఇద్దరి మధ్య బంధం అనేది శక్తి, ఉత్సాహాలు ఇచ్చి పుచ్చుకోవడంలా ఉంటాయి. తనతో మాట్లాడుతున్నప్పుడు, తనకి సన్నివేశం చెబుతున్నప్పుడు తను నాకు ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ఈ సినిమా ఎలా ఉంటుందో ఒకట్రెండు సన్నివేశాలతో చెప్పాను తప్ప ముందు నా దగ్గర కథ లేదు. తను నమ్మి నన్ను ప్రోత్సహించిన విధానం చూశాక ఏదైనా చేయొచ్చు అనిపించింది. తనని మూడేళ్లు కష్టపెట్టాను. తను నా కోసం మళ్లీ మూడేళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉంటే ‘పుష్ప3’ చేస్తా. సినిమా కోసం గొప్ప వేదికని ఏర్పాటు చేశారు మా నిర్మాతలు. ఏం చెప్పినా వెళ్లి చేసేస్తుంది రష్మిక. తన క్లోజప్ చూస్తూ కూర్చునేవాణ్ని. దేవిశ్రీప్రసాద్‌తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు.
నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ ‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. మరోసారి జాతీయ పురస్కారం ఇవ్వాలని కోరుకునే స్థాయిలో అల్లు అర్జున్ నటన ఉంటుంది. సుకుమార్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమా ఫలితం’’ అన్నారు.