Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:38 PM
సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్‌ను (allu arjun arrest) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్‌ను (allu arjun arrest) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ కాదని, కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను నిందితుల్లో ఒకరిగా గుర్తించి బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు. బన్నిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది.
అసలు ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందురోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. ‘పుష్ప2’ సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై నమోదైంది.
మరోవైపు పుష్ప- 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమానులు తెలిపారు. అందువల్ల తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్ తమదే అయినప్పటికీ ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్ మైత్రీ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.