Yatra 2: సెన్సార్ ఆఫీసరుపై నిర్మాత నట్టి కుమార్ తీవ్ర ఆరోపణలు
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:18 PM
నిర్మాత నట్టి కుమార్ హైదరాబాదు సెన్సారు ఆఫీసర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 'యాత్ర 2' లో చంద్రబాబు లాంటి రాజకీయనాయకులపై అసభ్యకరంగా వున్న సన్నివేశాలున్నా, అత్యవసరంగా ఆ సినిమాకి సెన్సారు సర్టిఫికెట్ ఇవ్వటం వెనక ఎవరున్నారో చెప్పాలని సెన్సారు ఆఫీసర్ ని ప్రశ్నించారు. ఆ ఆఫీసర్ వైస్సార్సీపీ కి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.
నిర్మాత నట్టి కుమార్ హైదరాబాదు రీజినల్ సెన్సారు ఆఫీసరుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 'యాత్ర 2' సినిమాకి సెన్సారు ఆఫీసరు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. జనవరి 22న సెన్సారు బోర్డుకి 'యాత్ర 2' సినిమా సెన్సార్ ఆపాలని ఒక లేక రాశానని, కానీ ఆ లేఖని పరిగణలోకి తీసుకోకుండా జనవరి 23న 'యాత్ర 2' సినిమాకి సెన్సారు చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. ఎన్నో చిన్న సినిమాలు పెండింగ్ లో వున్నా, ఈ సినిమాకి ముందుగా సర్టిఫికెట్ ఇచ్చారని నట్టి కుమార్ ఆరోపించారు.
సినిమాలు సెన్సారు చేసేటప్పుడు ఒక ఆర్డర్ లో తీసుకుంటారని, కానీ సెన్సారు ఆఫీసర్ అవేమీ పట్టించుకోకుండా 'యాత్ర 2' అప్లికేషన్ రాగానే ఎలా సెన్సారు చేశారని ప్రశ్నించారు నట్టి కుమార్. అసలు సినిమా చూసారా లేదా చూడకుండానే సర్టిఫికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ సెన్సారు చెయ్యడం వెనకాల ఎవరున్నారు, ఎవరి పులుకుబడి చేశారు అని అడిగారు నట్టి కుమార్. ఈ సినిమాకి నియమ నిబంధనలు ఏమీ సెన్సారు ఆఫీసరు పాటించలేదని అర్థం అవుతోందని ఆరోపించారు.
ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని కించపరిచే విధంగా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఇంతకు ముందు లేఖలో రాశాను, కానీ సెన్సారు ఆఫీసరు అవేమీ పట్టించుకోలేదు అని విమర్శించారు. సెన్సార్ ఆఫీసర్ వైసిపికి అనుకూలంగా వ్యవహరించారు అని నట్టి కుమార్ ఆరోపించారు.
ముంబై, కర్ణాటక సెన్సారు ఆఫీసులపై ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో కూడా సెన్సార్ ఆఫీసర్ పై విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు నట్టి కుమార్. సామజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రిపైనగానీ, లేదా ఇతర నాయకులపైనా గానీ ఏదైనా ఒక చిన్న కామెంట్ చేస్తేనే అరెస్టులు చేస్తున్నారు. మరి అసభ్యకరమైన సన్నివేశాలు పెట్టి రాజకీయ నాయకులను అసభ్యంగా చూపిస్తున్న సినిమాలకు సెన్సార్ ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించారు నట్టి కుమార్.
'యాత్ర 2' సెన్సారు సర్టిఫికెట్ వెనక్కి తీసుకోవాలని, అందుకు సోమవారం వరకు సమయం ఇస్తున్నాను అని, లేదంటే తాను న్యాయ పోరాటానికి సిద్ధం అవుతానని చెప్పారు నట్టి కుమార్. అలాగే 'యాత్ర 2' సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సారు ఆఫీసర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.