Naga Vamshi: థియేట‌ర్ల‌లో రేట్లు ఎక్కువేమీ లేవు.. ఆ మాత్రం పెట్ట‌లేరా! నెట్టింట గ‌రంగ‌రం

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:38 PM

ప్ర‌ముఖ నిర్మాత నాగవంశీ టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

nagavamshi

ప్ర‌స్తుతం మ‌న‌కు అంత‌టా బాగా వినిపిస్తున్న మాట అధిక రేట్లు. కుటుంబంతో క‌లిసి సినిమాకు వెళితే రెండు వేల వ‌ర‌కు అవుతుంద‌ని త‌రుచూ వింటున్నాం. కొన్నిసార్లు ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కుంటున్నాం. ఈ అధిక టికెట్ రేట్ల కారణంగా సామాన్యులకు సినిమా దూరమువుతుందనే వాదన బ‌లంగా ఉంది. అయితే సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి, నిర్మాతలు బతకాలంటే దానికి తగ్గట్లు రేట్లు ఉండాలని మరో వాదన కూడా ఉంది. అందుకే పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే, వారం పది రోజుల పాటు రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు నిర్మాతలు. కానీ ఈ అధిక రేట్ల కారణంగా ఇటీవల జనాలు థియేటర్లలోకి రావడం తగ్గిపోయారన్న అభిప్రాయాలున్నాయి.

ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamshi) ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో టికెట్ రేట్లు ఎక్కువేమీ లేవని.. మూడు గంటల వినోదం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అని జనాలను ప్రశ్నించారు. రూ.1500 ఖర్చు పెడితే నలుగురు సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చని సూచించారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. ఒక ఫ్యామిలీలో నలుగురు కలిసి సినిమాకు వెళ్తే.. సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ కి రూ.250 లెక్కన రూ.1000 అవుతుంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి రూ. 500 అనుకున్నా 1500 అవుతుంది. 1500 రూపాయలకు మూడు గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది.. ఆంధ్రా, తెలంగాణ, యూఎస్‌లలో అదే పదిహేను వందలకు అన్ని గంటలు ఎంటర్టైన్ చేసే ప్లేస్ ఏముందో చెప్పండంటూ ఎదురు ప్రశ్న వేశారు.

Naga Vamshi


పైగా షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. నేటికి చీప్‌గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమేని మిమ్మల్ని మూడు గంటలు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి 1500 తీసుకుంటే తప్పేంటంటూ రివ‌ర్స్‌లో క్వ‌శ్చ‌న్ చేశాడు. అదేవిధంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందనే ఎక్కువ రేట్లు అడుగుతున్నామని.. సినిమా మీద అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాం కాబట్టే ప్రభుత్వం నుంచి రేట్లు పెంచుకుంటామని పర్మీషన్ తెచ్చుకుంటున్నామన్నారు. దాంతో జనాలకేమీ అన్యాయం చేయడం లేద. నేను టికెట్ రేట్ 1000 పెడితే తప్పు కానీ 'దేవర' సినిమాకు పెట్టింది రూ.250లు మాత్రమే అన్నారు. ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు మాత్రమే కదా అవుతుంది. నెలకు మహా అయితే రెండు సినిమాలు చూస్తారు.. ఎవరూ 20 సినిమాలు చూడటం లేదు కదా అని నాగవంశీ అన్నారు. అలాగే ఓటీటీలోకి నాలుగు వారాలకు సినిమా వస్తే తప్పేంటని ప్రశ్నించారు. వాళ్లు మేము అడినంత డబ్బులు ఇస్తున్నారు కాబట్టే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయినా సినిమాలకు నాలుగు వారాలు తక్కువ సమయమేమీ కాదన్నారు.

ఇదిలాఉండ‌గా నాగ‌వంశీ చేసిన వ్యాక‌య్ల‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నారు. డబ్బున్న వాళ్ల‌కు 1500 త‌క్కువ కావోచ్చేమో గానీ మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి అవి చాలా ఎక్కువ అని కామెంట్లు చేస్తున్నారు. 1500 అమౌంట్‌తో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్స‌న్ వ‌స్తాయ‌ని, బిర్యానీ వ‌స్తాయంటు కౌంట‌ర్ ఇస్దున్నారు. అంతేగాక షాపింగ్ మాల్‌లో కొన్న వ‌స్తువు మ‌న అవ‌స‌రాలు తీరుస్తుంది.. సినిమా మ‌న అవ‌స‌రాలేమైనా తీరుస్తుందా అంటూ కౌంట‌ర్ ఇస్తున్నారు. మ‌రోసారి మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని అవ‌మానించేలా మాట్లాడ‌కూడ‌దంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

Updated Date - Oct 14 , 2024 | 05:38 PM