Teja Sajja - Prasanth Varma: మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలి..
ABN , Publish Date - Dec 01 , 2024 | 05:49 PM
నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య మంచి రాపో ఉన్న సంగతి తెలిసిందే! వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జాంబీ రెడ్డి’, ‘హను-మాన్’ చిత్రాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి.
నటుడు తేజ సజ్జా(Teja Sajja), దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) మధ్య మంచి రాపో ఉన్న సంగతి తెలిసిందే! వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జాంబీ రెడ్డి’, ‘హను-మాన్’ (Hanuman)చిత్రాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎక్స్ వేదికగా తాజాగా వీరిద్దరి మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలంటూ ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ వర్మ రిప్లైగా ఇవ్వడం వైరల్‌గా మారింది. శనివారం తేజ సజ్జా ఓ పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో (Ranvir Singh) దిగిన ఫొటోని షేర్ చేశారు. రణ్‌వీర్ ప్రశంస తనని ఎంతగానో కదిలించిందన్నారు. ‘‘ఆయన నా వర్క్ గురించి మాట్లాడిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. ఎంతో ప్రేమ చూపారు. చిన్న విషయాలను కూడా గమనించి ప్రోత్సహించారు. అది కేవలం ప్రశంస మాత్రమే కాదు.. స్వచ్ఛమైన ప్రోత్సాహం’’ అని రాసుకొచ్చారు.
దీనిపై ప్రశాంత్ వర్మ స్పందించారు. ‘‘ఫొటో క్రెడిట్ లేదా పుష్ప’’ అంటూ ఈ ఫొటో తానే తీసినట్లు పరోక్షంగా చెప్పారు. దీనిపై తేజ స్పందిస్తూ.. ‘కృష్ణ’ సినిమాలో బ్రహ్మానందం ‘వచ్చేశాడు’ అంటూ అసహనం వ్యక్తం చేేస సీన్ క్లిప్‌ను రిప్లైగా ఇచ్చారు. ప్రశాంత్ అంతటితో ఆగకుండా.. ‘‘మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలి అని ఒక పెద్దాయన ఒకానొక సమయంలో చెప్పారు’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ సరదా సంభాషణ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అసలు దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..
‘పుష్ప ది రూల్’ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘పుష్ప’ మా అందరికీ ప్రత్యేకం. మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా.. తెరపై మన పేరైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు’’ అని అన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘సర్.. వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే.. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ చేయలేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ, ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి. నా విషయంలో మీకు కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వేదికకు వచ్చేటప్పుడూ రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్ టైమ్ సర్’’ అని అన్నారు.