Pranayagodari: ఆస్తులన్నీ అమ్ముకున్నా.. అప్పులు తెచ్చి మరీ సినిమా తీశానంటోన్న నిర్మాత
ABN , Publish Date - Dec 10 , 2024 | 11:08 PM
నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను.. ఆస్తులన్నీ అమ్ముకున్నాను.. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశానని అన్నారు దర్శకనిర్మాత విఘ్నేశ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రణయ గోదారి’. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కాబోతోన్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఈ సినిమాను ప్రేక్షకులను థియేటర్లలో చూడాలని కోరారు.
సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్లుగా.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిసెంబర్ 13న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘ప్రణయగోదారి’ టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది.
Also Read-మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్
అనంతరం అతిథి సోహెల్ మాట్లాడుతూ.. ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమాను తీశాను.. నష్టపోయాను. నన్ను ట్రోలింగ్ కూడా చేశారు. హిట్టు కొట్టాలనే ఎవ్వరైనా సినిమాను చేస్తారు. ప్రణయ గోదారి టీంలో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చాలా నేచురల్‌గా చేశారు. డిసెంబర్ 13న వస్తున్న ఈ సినిమాను అందరూ చూడాలని కోరుతున్నానని అన్నారు.
దర్శక, నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ.. అతిథులందరికీ ధన్యవాదాలు. నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నాను. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను. నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీ చేశా. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ప్రసాద్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చాలా కష్టపడి చిత్రాన్ని అయితే తీశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంగతి నాకు ఇప్పుడర్థమైంది. పి.ఆర్.ఓ. సాయి సతీష్ సపోర్ట్ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చి మా సినిమాకు థియేటర్లు ఇస్తామని అన్నారు. మా సినిమా డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండని కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా టీమ్‌ని అభినందించారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ ప్రియాంక ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ, నటి ఉషా శ్రీ వంటి వారు ప్రసంగించారు.