Singer Mano: హోటల్‌లో గొడవ.. గాయకుడు మనో కుమారులపై కేసు
ABN , Publish Date - Sep 12 , 2024 | 07:15 PM
ప్రముఖ గాయకుడు మనో కుమారులు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఈ వార్త తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ గాయకుడు మనో (Mano) కుమారులు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఈ వార్త తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
అయితే రెండు రోజుల క్రితం వారు తమ ట్రైనింగ్ అయ్యాక అకాడమీ నుంచి బయటికి వచ్చి వలసర వాక్కంలో ఉన్న ఓ హోటల్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతో పాటు వారి మరో ముగ్గురు స్నేహితులు హోటల్‌లోనే ఉన్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు కృపాకరన్‌తో గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త మాట మాట పెరిగి .. ఈ ఐదుగురు కృపాకరన్ అతని స్నేహితుడిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ గొడవలో గాయపడిన కృపాకరన్‌ను స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వళసరవాక్కం పోలీసులు కృపాకరన్ ఫిర్యాదు మేరకు గాయకుడు మనో కుమారులు సహా వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన ఐదుగురిలో ఇద్దరు అరెస్టు కాగా.. మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేగాక ఈ కేసులో మనో మేనేజర్, ఇంటి పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.