Naga Chaitanya: వెలితిని పూర్తి చేస్తుందనే బలమైన నమ్మకంతో..
ABN , Publish Date - Nov 24 , 2024 | 08:22 PM
తనకు కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్కినేని నాగచైతన్య. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందన్నారు.
తనకు కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ్లను (Sobhita Dhulipala) ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందన్నారు. ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానని అన్నారు. ‘‘మా పెళ్లి చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్థంగా జరగనుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు చోటు లేదు. ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. తనకు నేనెంతో కనెక్ట్ అయ్యా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నా’’ అని తాజాగా ఇచ్చిన ఇంటర్వూయలో ఆయన చెప్పారు.
నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. దీనిపై తాజాగా నాగార్జున (Nagarjuna) కూడా స్పందించారు. ‘‘కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నాం. స్టూడియోలో అందమైన సెట్‌లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారు’’ అని అన్నారు. రిసెప్షన్ వివరాలను త్వరలో తెలుపుతామని నాగ్ చెప్పారు. నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ చిత్రం చేస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. దాంతోపాటు కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమాను చై పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.