Mohan Babu: మోహన్‌బాబు ఎక్కడున్నాడో తెలీదు.. పోలీసులు

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:25 PM

మోహన్ బాబు ఎక్కడనున్నారో తెలీదు అంటూ పోలీసులు తెలపడం సంచలనంగా మారింది..

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఎపిసోడ్‌లో ట్విస్ట్ కాదు బిగ్ ట్విస్ట్ కొనసాగుతోంది. మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన మెడికేషన్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందించినట్లు పహడి షరీఫ్ పోలీసులు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తానే విచారణకు వస్తానని పోలీసులకు మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణ సమయంలో తన గన్ సబ్ మిట్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు హామీ ఇచ్చారు. అయితే మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో.. తమకు సమాచారం లేదని పహడి షరీఫ్ పోలీసులు ఆదివారం స్పష్టం చేయడం గమనార్హం.


శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు. నేను మా ఇంట్లోనే వైద్య సంరక్షనలో ఉన్నాను. వాస్తవాలను తెలుసుకుని ప్రసారం చేయాలని ఈ సందర్భంగా మీడియాను కోరుతున్నాను’’ అని పేర్కొని ఇప్పుడు అజ్ఞాతంలో ఉండటం విశేషం.


జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది. ఇటీవల మంచు ఫ్యామిలీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. మరీ ముఖ్యంగా మంగళవారం రాత్రి వారి ఫ్యామిలీలో యుద్ధ వాతావరణం నెలకొంది. వారి గొడవపై రాచకొండ సీపీ మంచు హీరోలైన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆస్తుల కోసమని, ఆత్మగౌరవం కోసమని జరిగిన ఈ గొడవల్లో.. ఫైనల్‌గా వర్కర్స్ కోసం గొడవ జరిగిందనేలా మ్యాటర్ బయటికి వచ్చింది. అయితే మంచు మనోజ్ మాత్రం విషయం వేరే ఉందని, అన్ని బయటపెడతానని చెప్పినప్పటికీ సీపీ ఆదేశాలతో ఆయన మళ్లీ మీడియా ముందుకు రాలేదు.

Updated Date - Dec 15 , 2024 | 12:25 PM