Pushpa 2: తెరపైకి 'జై భీమ్' వర్సెస్ 'పుష్ప'.. సీతక్క హాట్ కామెంట్స్
ABN , Publish Date - Dec 23 , 2024 | 06:03 PM
గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో 'జై భీమ్' సినిమాకి అన్యాయం జరిగిందని అనేక వాదనలు వినిపించాయి. అలాగే 'పుష్ప' సినిమాకి అవార్డు ఎలా ఇస్తారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు కొందరు అల్లు అర్జున్ తీరుపై మండిపడితే.. మరికొందరు ప్రభుత్వ వైఖరిపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
2021లో రీలీజైన పుష్ప సినిమాకి 2023లో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం కేటగిరీల్లో అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. 100 ఏళ్ల భారత సినీ చరిత్రలో ఉత్తమ నటుడి పురస్కారం ఒక తెలుగు వాడు అందుకోవడం అదే ఫస్ట్ టైమ్. అయితే.. అదే ఏడాది తమిళంలో రిలీజైన సూర్య 'జై భీమ్' సినిమాకి మాత్రం జ్యూరీ మొండి చేయి చూపెట్టింది. దీంతో ఇది అప్పట్లో పెద్ద చర్చగా మారింది. 'జై భీమ్'ని కాదని 'పుష్ప'కి ఎలా అవార్డు ఇస్తారని రాద్ధాంతం చేశారు.
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో మరోసారి మంత్రి సీతక్క ఈ టాపిక్ ని లేవనెత్తారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు" అంటూ ఫైర్ అయ్యారు.