Manchu Vishnu: మంచు విష్ణుకు సీపీ వార్నింగ్..
ABN , Publish Date - Dec 11 , 2024 | 09:50 PM
రాచకొండ సీపీ.. మంచు ఫ్యామిలీ విషయంలో సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మంచు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సీపీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనోజ్ విచారణకు హాజరు కాగా, మోహన్ బాబుకి ఆరోగ్య కారణాల రీత్యా తెలంగాణ హైకోర్టు ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా విచారణలో భాగంగా మంచు విష్ణు సీపీ ముందు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే సీపీ విష్ణుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని కమిషనర్ విష్ణుకి సూచించినట్లు సమాచారం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మొదట పోలీసులకు సమాచారం అందించాలని సీపీ ఆదేశించారు. మరోసారి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో గత మూడు రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో తెలిసిందే. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటుచేసుకున్న వివాదం.. మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్, మౌనికలను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది.
జల్‌పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిల్మ్‌నగర్ పోలీసులు మోహన్‌బాబు, మనోజ్ లైసెన్స్ గన్‌లను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్‌బాబు, మంచు మనోజ్, మంచు విష్ణులకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు.