Manchu Vishnu: ప్రకాశ్‌రాజ్‌తో శివయ్య అనిపించా.. శ్రీరామ్ అని కూడా అనిపిస్తా!
ABN , Publish Date - Sep 29 , 2024 | 03:47 PM
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ‘మా’ అధ్యక్షుడు (Maa President) మంచు విష్ణు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో మాట యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్‌పై తాజాగా మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు..
తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ‘మా’ అధ్యక్షుడు (Maa President) మంచు విష్ణు (Vishnu) విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో మాట యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఇటీవల ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ట్వీట్‌ను ఉద్దేశించి ‘‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలను కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు జస్ట్ ఆస్కింగ్)’’ అని పేర్కొన్నారు.. దీనిపై విష్ణు స్పందిస్తూ ‘‘మీ పరిధిలో మీరు ఉండండి’’ అని రిప్లై ఇచ్చారు మంచు విష్ణు. దీంతో వీరిద్దరి మధ్య చర్చ నడిచింది. ఆదివారం దీనిపై మంచు విష్ణు స్పందించారు. అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని మీడియాతో చెప్పారు.
ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ "అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. నేను నా అభిప్రాయాన్ని తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా.. ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పా. నాన్న నటించిన చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. ఎంతోకాలం నుంచి ఆయన తెలుసు. ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది. ఎలాంటి కాంట్రవర్సీ లేదు’’ అని విష్ణు అన్నారు. ఈ వివాదంపై నటీనటులు స్పందించక పోవడం గురించి ఆయన మాట్లాడారు. ‘‘నటీనటులంతా అద్దాల మేడల్లో ఉంటాం. ఏదైనా విషయంపై నేను మాట్లాడితే కొంతమందికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చనివాళ్లు టార్గెట్ చేసి మాట్లాడతారు. అందుకే నటీనటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయేమోనని భయంగా ఉంది. ప్రకాష్ రాజ్ దేవుడిని నమ్ముతాడో లేదో నాకు తెలీదు. కానీ ఈ విషయంలో అతని చేత శివయ్య అని పలికించాను. జై శ్రీరామ్ అని కూడా చెప్పిస్తాను’’ అని అన్నారు.
ఇంకా ‘మా’ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ.. ‘మా’ అధ్యక్షుడిగా నేను అనుకున్నవన్నీ చేస్తున్నాను. త్వరలోనే మా బిల్డింగ్‌పై కూడా ఓ అప్‌డేట్ రానుంది. లైంగిక వేధింపులు కేసులో జానీ మాస్టర్ తప్పుంటే కఠినశిక్ష పడాలి. ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో రక్షణకు కొదవ లేదు అని అన్నారు. అలాగే నటి హేమ డ్రగ్స్ కేసు గురించి స్పందించమని కోరగా ఆ వివాదంపై నేను మాట్లాడనన్నారు విష్ణు.